వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్ ను లక్ష్యంగా చేసుకొని, నిందితుడు సీనియర్ సైఫ్ వేధించాడని వరంగల్ ఏసీపీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు. గత 4 నెలలుగా తీవ్రంగా వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయని, స్నేహితులతో కలిసి వేధించారన్నారు. వాట్సాప్ గ్రూప్ లో ప్రీతిని అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలాంటి మేసేజ్‌లు పెట్టవద్దని మెడికో వేడుకున్నప్పటికీ వినలేదు అన్నారు. సైఫ్ పెట్టిన మేసేజ్‌లను తామూ పరిశీలించామని, ఇతర విద్యార్థులతో కలిసి ప్రీతిని వాట్సాప్ గ్రూప్ ల్లో టార్గెట్ చేసినట్లు గుర్తించామని చెప్పారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయన్నారు. అతని వేధింపుల గురించి 20వ తేదీన తల్లిదండ్రులకు చెప్పిందని, 21వ తేదీన కాలేజీ యాజమాన్యం ప్రీతి, సైఫ్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అంతలో మంగళవారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.
ప్రీతి ప్రశ్నించే తత్వాన్ని.. జీర్ణించుకోలేక..
అయితే డిసెంబర్ నుండే టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రీతి తన తప్పులను ప్రశ్నించడాన్ని సైఫ్ సహించలేకపోయాడని, దీంతో ఇది జరిగిందన్నారు. ప్రీతిది ప్రశ్నించేతత్వమని, అనే నిలదీయడాన్ని, సైఫ్ ఏ మాత్రం జీర్ణించుకోలేక పోయాడని, ఇదే విషయాన్ని తన స్నేహితులకు కూడా చెప్పాడని తెలిపారు. అందుకే ఆమెకు ఈ మాత్రం సహకరించ వద్దని స్నేహితులకు చెప్పాడని, కక్ష కట్టి టార్గెట్ చేయడంతో అనే అతని గురించే ఆలోచించడం ప్రారంభించింది అన్నారు. ఆమె డేరింగ్ తో పాటు సెన్సిటివ్.. దీంతో అతని వేధింపుల గురించి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. ఏ ఇంజెక్షన్ తీసుకున్నది నివేదికలో తేలుతుందని చెప్పారు. టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయి అన్నారు.
వాట్సాప్ లలో టార్గెట్
సైఫ్ తనను టార్గెట్ చేశాడని, వేధిస్తున్నాడని, హేళన చేస్తున్నాడని ప్రీతి తన స్నేహితులతో చెప్పి ఆవేదనకు గురైందని చెప్పారు. వాట్సాప్ గ్రూప్ లలో వేదిస్తున్నట్లు స్నేహితులతో చేసిన చాట్ లో తెలిపారు. డిసెంబర్ 6వ తేదీ నుండి మూడుసార్లు చిన్న ఘటనలు జరిగాయి. సీనియర్లను జూనియర్లు.. సార్ అనాలంటూ రాగింగ్ చేస్తున్నారు. సైఫ్, వారి స్నేహితుల తీరు దారుణంగా ఉందని భావించిన ప్రీతి అభిప్రాయపడింది. ఈ నెల 18వ తేదీన వాట్సాప్ గ్రూప్‌లో ఛాటింగ్ చేశారు. తనను టార్గెట్ చేస్తూ చాట్ చేయడం సరికాదని అతనికి చెప్పింది. కానీ అతను మాత్రం డిసెంబర్ నుండే అమ్మాయినే టార్గెట్ చేశాడని తెలిపారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిడి లేదని, పోలీసుల నిర్లక్ష్యం లేదని చెప్పారు. కాగా సైఫ్ అండ్ సీ చేసిన తప్పులను ప్రీతి ప్రశ్నించడం తట్టుకోలేక.. మూడు నాలుగు నెలలుగా టార్గెట్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.