హైదరాబాద్ పరిధిలో మరోసారి ఓ హోటల్లో పాడైన బిర్యానీ దొరికిపోయింది. ఆ కస్టమర్ తీసుకున్న ఆర్డర్లో తనకు కుళ్లిన మాంసం(Rotten biryani) వచ్చిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని హోటళ్లల్లో ఇటీవల నాణ్యత లేని ఫుడ్ ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని డైమండ్ కేఫ్ హోటల్లో కుళ్లిపోయిన బిర్యానీ కలకలం రేపింది. ఇదేంటని కస్టమర్ ప్రశ్నిస్తే హోటల్ యాజమాన్యం పట్టించుకోని వైనం నెలకొందని కస్టమర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని భాదిత కస్టమర్ డిమాండ్ చేశారు.
మాంసం దుర్వాసన, అపరిశుభ్రంగా ఉంది. కుళ్ళిన స్టాక్‌ను పారేయకుండా నిర్వాహకులు బిర్యానీలో మాంసాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ క్రమంలో మంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో కూడా పలు మార్లు అధికారులు అనేక హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కుళ్లిన మాంసం సహా బిర్యానీ వంటకాలు వండినందుకు జరిమానా విధించిన ఘటనలు ఇది వరకే చుశాం.
అంతేకాదు నగరంలోని దుకాణాల్లో విక్రయించే మాంసాన్ని కొనుగోలు చేసే ముందు కస్టమర్లు కూడా జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు చెబుతున్నారు. వారు నిల్వ చేసిన మాంసాన్ని అమ్ముతున్నారా లేదా తాజా మాసం అమ్ముతున్నారా అనేది గమనించాలని సూచిస్తున్నారు.