Avinashకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు, 25 వరకు అరెస్ట్ చేయొద్దు:హైకోర్టు
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇస్తూనే.. షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది.
Avinash:వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash)కి ముందస్తు బెయిల్ లభించింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. 25వ తేదీ వరకు రోజు విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టంచేసింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని 6 రోజుల కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరితో కలిసి అవినాశ్ రెడ్డిని రేపు ఉదయం 10.30 గంటల నుంచి సీబీఐ అధికారుల బృందం విచారించనుంది.
ఆదివారం ఉదయం పులివెందులలో అవినాష్ (Avinash) తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం విచారణకు రావాలని అవినాష్‌ను కోరగా.. నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ ఉన్న.. విచారణకు బయల్దేరారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రావాలని సీబీఐ అదనపు ఎస్పీ వాట్సాప్‌లో అవినాష్‌కు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ముందస్తు బెయిల్‌పై వాదనలు జరగగా.. అవినాష్‌కు ఊరట లభించింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టంచేసింది. ఆ రోజు తుది తీర్పు ఇస్తామని తెలిపింది.
వివేకా హత్య కేసు విచారణ ఈ నెల 30వ తేదీ లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిందని సీబీఐ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. విచారణకు రావాలని పిలిస్తే అవినాష్ పిటిషన్లు వేస్తూ తప్పించుకుంటున్నారని పేర్కొంది. ఈ రోజు కూడా అవినాష్ తరఫు న్యాయవాది వివేకా హత్యకు 4 కారణాలు ఉండొచ్చు అని కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతోనే వేధిస్తున్నారని అవినాష్ తరఫు న్యాయవాది అన్నారు. విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు లాయర్ పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని వదిలేసి.. తమ వెంట పడ్డారని అవినాష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మేరకు అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత కోరడంతో.. సీబీఐకు అప్పగించారు. కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీలో ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ఇక్కడికి మార్చారు. వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో.. పలుమార్లు విచారించిన ధర్మాసనం కేసు విచారణను 2023 ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని సీబీఐకి స్పష్టంచేసింది. దీంతో సీబీఐ విచారణను స్పీడప్ చేసింది. అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అవినాష్‌ను విచారిస్తే.. కేసు విచారణ పూర్తి అవుతుందని సీబీఐ చెబుతోంది.