కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికి ఇబ్బంది పడాల్సి వస్తోందని తన శాఖపరమైన విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్లు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. చివరకు పెన్ను కొనాలన్నా ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో సరదాగా సంభాషించారు.
ఈ సందర్భంగా తన శాఖలో ఉన్న పరిస్థితిపై నోరు విప్పారు. ‘కేంద్ర మంత్రిగా ఉన్న తాను జేబులో పెట్టుకునే పెన్ను కొనాలన్నా మాకు కేటాయించిన ఒక యాప్ లోకి వెళ్లి ఆర్డర్ ఇవ్వాలి. కుర్చీలు, బిస్కట్లు తదితర ఇలా ఢిల్లీలోని తన కార్యాలయానికి ఏవీ కావాలన్నా.. ఏ వస్తువు అవసరమైనా ఆ యాప్ లో ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ రాగానే వారికి డబ్బులు చెల్లించాలి. పారదర్శకంగా ఉండేందుకు ప్రధాని మోదీ ఈ విధానం తీసుకొచ్చారు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.