హైదరాబాద్లో(hyderabad) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనదారులు గమ్య స్థానం చేరాలంటే అనుకున్న దానికంటే రెట్టింపు సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు. మరోవైపు అంబులెన్సులు కూడా సమయానికి చేరుకోలేకపోతున్నాయమని చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు వచ్చే 10 రోజులు ట్రాఫిక్ ఇబ్బందులు(traffic problems) మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నాంపల్లి(nampally) అసెంబ్లీ పరిధిలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీంతోపాటు ఫిబ్రవరి 11న హుస్సేన్ సాగర్(hussain sagar) తీరాన ఫార్ములా ఈ-రేసింగ్(formula e-racing) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున సాగర్ తీరాన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో జరుగనున్న ఈ పోటీలకు దాదాపు 21 వేల మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పరిధిలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే రేసింగ్ జరిగే రోజున సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ వైపు మార్గంలో వాహనదారులు వెళ్లేందుకు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు అబిడ్స్, నాంపల్లి దగ్గరలో జరుగుతున్న నుమాయిష్(numaish) 15వ తేదీ వరకు కొనసాగనుండగా..ఈ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ తిప్పలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 17న తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలో నూతన సచివాలయం(telangana new secretariat) ప్రారంభోత్సవం సందర్భంగా కూడా వాహనదారులకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇక ఫిబ్రవరి 18న మహాశివరాత్రి(maha shivratri) వేడుకలు జరగనున్న నేపథ్యంలో భాగ్యనగరంలోని ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంది. మొత్తంగా నేటి నుంచి ఫిబ్రవరి 18 వరకు 10 రోజులు హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు(traffic police) ఆ క్రమంలో తలెత్తే ఇబ్బందులు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న ప్రాంతాల గుండా కాకుండా ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు మరో 500 మంది ట్రాఫిక్ సిబ్బందిని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 30 నుంచి 40 లక్షల వాహనాలు రోడ్లపై ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. పలు సందర్భాలలో అయితే 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు దాదాపు 40 నిమిషాల సమయం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. కానీ పలు చోట్ల కొంత మంది ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోవడం వల్లే మరింత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు పలు రోడ్డు మార్గాల్లో తోపుడు బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.