నిలదీస్తే దాడులు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఏపీ ప్రజలు ప్రశ్నిస్తుంటే మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు దాడులకు తెగబడుతున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అలియాస్ యూవీ రమణమూర్తి రాజు (UV Ramana Murthy Raju- Kannababu) మరింత రెచ్చిపోతున్నాడు. ఓ యువకుడు నిలదీస్తే గతంలో అతడిపై దాడి చేసిన ఈ ఎమ్మెల్యే తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. నిలదీసిన సొంత పార్టీ నాయకులపై చేయి చేసుకున్నాడు. ఇది అడ్డుకోబోయిన తన పీఏ (PA)పైనే కొట్టిన సంఘటన అనకాపల్లి జిల్లాలో (Anakapalle District) చోటుచేసుకుంది.
యలమంచిలి (Elamanchili) నియోజకవర్గం అచ్యుతాపురం మండలం మత్య్సకార గ్రామం పూడికమడకలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొనగా.. కొందరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath) వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అని నినదించారు. ‘కన్నబాబు వద్దు.. జగనన్న ముద్దు’ అని నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ నిరసనతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నిలదీసిన వ్యక్తులపై దాడికి పాల్పడేందుకు ఎమ్మెల్యే కన్నబాబు రాజు (Kannababu Raju) దూసుకెళ్లారు. అయితే అలా వెళ్లొద్దు అని అతడి వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) నవీన్ వర్మ (Naveen Verma) వారించారు. ఈ సందర్భంగా చేయి పట్టుకుని వెనక్కి లాగారు. తీవ్ర అసహనానికి లోనైన ఎమ్మెల్యే పీఏ చెంపదెబ్బ వేశారు. దీంతో స్థానికంగా గందరగోళం ఏర్పడింది. వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య విభేదాలు రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అనకాపల్లి జిల్లాలో గుడివాడ అమర్ నాథ్ వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ క్రమంలోనే తాజా సంఘటన చోటుచేసుకుంది.