ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం, జనసేన పొత్తుపై కూడా అంబటి స్పందించారు. ఎంతమంది కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమను గెలిపిస్తాయని చెప్పారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనం లేక వెలవెలపోతోంది అన్నారు. లోకేష్ పాదయాత్రతో ఒరిగేది ఏం లేదు అన్నారు. తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కొడుకు కూడా సీఎం కావాలని లేదన్నారు. లోకేష్ ఎన్నీ పాదయాత్రలు చేసిన ప్రయోజనం ఉండదు అన్నారు. పవన కళ్యాణ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ లోకేష్ ఇద్దరూ బఫూన్ లే అన్నారు. ఇక చిరంజీవి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నారని, మంచిగా సినిమాలు తీసుకుంటున్నారని, ఆయన రాజకీయాల్లోకి రాకపోవచ్చు అని చెప్పారు.