• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చోరీ కేసులో నలుగురికి జైలుశిక్ష

NDL: దొంగతనం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నలుగురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తంబళ్లపల్లె కోర్టు తీర్పునిచ్చింది. నంద్యాల జిల్లాకు చెందిన అంకన్న, సత్య, చిన్నహుస్సేని, జంబులును పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్య గారిపల్లెలో అక్టోబర్ 2025న దొంగతనం నేరంలో అప్పటి ఎస్సై హరిహర ప్రసాద్ అరెస్టు చేశారు. తాజాగా వీరికి శిక్ష ఖరారైంది.

April 29, 2026 / 05:39 AM IST

జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద తగ్గిన రద్దీ

KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘువీర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు జిల్లాలోని 90 శాతం బంకుల్లో సాధారణ స్థితి కనిపించినట్లు పేర్కొన్నారు. ఇవాళ్టితో 100 శాతం ఇంధనం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.

April 29, 2026 / 05:33 AM IST

అపోహలు, ఆందోళనలు సృష్టించవద్దు: ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం రాత్రి బ్యాంకులను సందర్శించి వాహనదారులతో మాట్లాడారు. రోజు రోజుకు సరఫరా విషయంలో పరిస్థితులు మెరుగు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతినిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను కూడా అప్రమత్తం చేస్తున్నారన్నారు. రెవిన్యూ, పోలీస్ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయన్నారు.

April 29, 2026 / 05:29 AM IST

టీడీపీలో చేరేందుకు పలు కుటుంబాలు సిద్ధం

ELR: నరసాపురం మండలం శ్రీరామవరంలో 20 కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ కుటుంబాలతో మల్లుకుంట సొసైటీ ఛైర్మన్ శీలం సాయి వినయ్ మంగళవారం రాత్రి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 29, 2026 / 05:23 AM IST

శాంతిభద్రతల్లో నిర్లక్ష్యం వద్దు : DIG

KDP: పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. సుండుపల్లిలో ఇటీవల ప్రారంభించిన పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరు, హాజరుపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

April 29, 2026 / 05:17 AM IST

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం.!

KRNL: ఆదోని నుంచి పత్తికొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆస్పరి సమీపంలో మంగళవారం సాయంత్రం ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సుకు అకస్మాత్తుగా టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన ఆపడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ఆలస్యమైతే బస్సు బోల్తా పడేదని, డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు.

April 29, 2026 / 05:15 AM IST

రేపు ‘ఆఫ్-సైట్’ మాక్ డ్రిల్: కలెక్టర్

NDL: జిల్లాలో రసాయన విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నెల 30న ‘ఆఫ్-సైట్’ మాక్ డ్రిల్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అమరావతి నుంచి నిర్వహించిన VCలో డీఆర్‌వో రాము నాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

April 29, 2026 / 05:11 AM IST

బావిలో పడ్డ చుక్కల జింక.. రక్షించిన అధికారులు

PLD: కోసూరు గ్రామ శివారులో దారి తప్పి పొలాల్లో ఉన్న నూతిబావిలో పడిన చుక్కల జింకను ఎర్రబాలెం గ్రామ స్థానికులు గుర్తించారు. క్రోసూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని జింకను బావి నుంచి బయటకు తీశారు. పిడుగురాళ్ల ఫారెస్ట్ ఆఫీసర్ కే. నరసింహారెడ్డి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చుక్కల జింకను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

April 28, 2026 / 10:20 PM IST

రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్: ఎస్పీ

KRNL: రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో ఇవాళ ముఖ్య కూడళ్లలో, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

April 28, 2026 / 10:00 PM IST

‘ఆక్వా రంగానికి అండగా కూటమి ప్రభుత్వం’

SKLM: రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2.34 లక్షల హెక్టార్లలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. ఆక్వాకల్చర్ రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.

April 28, 2026 / 09:58 PM IST

ఆంజనేయస్వామి ఆలయానికి రూ.2 లక్షల విరాళం

BPT: అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఈనెగనూరి పడిగల రెడ్డి ధర్మపత్ని ఆదిలక్ష్మి రూ.2 లక్షల విరాళాన్ని మంగళవారం ప్రకటించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ మురళి సుధాకర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతలను ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

April 28, 2026 / 09:37 PM IST

అనంతపురంలో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం

ATP: అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 30 వరకు జరిగే ఈ పోటీలను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడమే ఈ లీగ్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

April 28, 2026 / 09:30 PM IST

హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

KDP: వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ వేంపల్లె జర్నలిస్టుల సంఘం సభ్యులు మంగళవారం సీఐ నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 09:30 PM IST

వివాహ రిసెప్షన్‌కు హాజరైన చిట్టిబాబు

CTR: గంగాధర నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అర్జున్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బెంగళూరులో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి,రాజంపేట శాశ్వత పరిశీలకులు భీమినేని చిట్టిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవి నాయుడు, కొత్త వెంకటాపురం సర్పంచ్ ప్రసన్న కుమార్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, సుధాకర్ నాయుడు, లోకనాథం పాల్గొన్నారు.

April 28, 2026 / 09:26 PM IST

శ్రీశైలంలో ముగిసిన పాలకమండలి సమావేశం

NDL: శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ట్రస్ట్‌బోర్డు సభ్యుల సమావేశం ముగిసింది. ఇందులో 15 అంశాలకు ఆమోదం తెలుపగా 2 అంశాలను తిరస్కరించారు. 20 చోట్ల భక్తుల కోసం టాయ్‌లెట్ల నిర్మాణం, రూ.24 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణానికి ఆమోదం, 6 వేల మొక్కలు నాటాలని బోర్డు నిర్ణయించినట్లు ఈవో చెప్పారు.

April 28, 2026 / 09:10 PM IST