నెల్లూరు: బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈనెల 26న నెల్లూరు వస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి తెలిపారు. నెల్లూరులో మాట్లాడుతూ.. యాదవ భవన్లో ఈనెల 26న బీసీ సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణతో కలిసి నారాయణపురం – నాగిరెడ్డిపల్లి వంతెనను ప్రారంభించారు. సుమారు రూ. 4.79 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల 15 గ్రామాల ప్రజల 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైంది. గతంలో వంతెన లేక ప్రజలు పది కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేదని ఎమ్మెల్యే తెలిపారు.
కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోటిపల్లి రాజారావు (47) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు దిగుడుబావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతునికి భార్య మాణిక్యం, కుమార్తె ఉన్నారు. అయినవిల్లి ఎస్సై కే జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
NDL: ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సోమవారం గోస్పాడులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గోశాలను ప్రారంభించారు. విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ పీ.దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి దంపతులు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాలను ఏర్పాటు చేయడం అద్భుతమని ఆయన కొనియాడారు.
CTR: వేదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పురుషోత్తం, తహసీల్దార్ బాబు ఆధ్వర్యంలో 2027 జనాభా లెక్కల రెండో బ్యాచ్ ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ప్రారంభమైంది. అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
TPT: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో నరసింహులు సంబంధిత అధికారులతో కలిసి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్యానర్‌ను ఆవిష్కరించారు. మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
ATP: ఆయా శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, ఉపాధి హామీ, జలధార, జనగణన తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎంఏవై అర్బన్ కింద 17,239 ఇళ్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.
కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మంగళగిరి NRI ఆసుపత్రిలో వారికి చికిత్స అందగా, జిల్లా SP వి. విద్యాసాగర్ నాయుడు వెళ్లి పరామర్శించారు. వైద్యుల కృషి, సిబ్బంది ధైర్యం, కుటుంబాల మద్దతుతో కోలుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి పామూరు, నెల్లూరు మీదుగా తిరుపతికి ప్రతిరోజు సాయంత్రం 06.00 గంటలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షయానా బేగం తెలిపారు. ఈ బస్సు సాయంత్రం 6 కనిగిరిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 1 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు కనిగిరికి చేరుకుంటుందన్నారు.
BPT: సంతమాగులూరులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొప్పరం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం 10:30 గంటలకు కొమ్మాలపాడులో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.
KRNL: కోసిగి మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ కార్యాలయంలో సోమవారం రైతులకు కీలక సూచనలు చేశారు. విత్తనాలను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో రసీదు తీసుకోవాలని సూచించారు. పంట కాలం ముగిసే వరకు బిల్లులను భద్రపరుచుకోవడం వల్ల మొలక సమస్యలు లేదా పంట ఎదుగుదల లోపాలు తలెత్తినప్పుడు చర్యలు ఉంటాయన్నారు.
GNTR: తెనాలిలో మహిళ కంట్లో కారం కొట్టి ఇద్దరు మహిళలు గొలుసు అపహరించారు. పట్టణ నాజరుపేటకు చెందిన భూలక్ష్మి టైలరింగ్ పని చేస్తుంది. నాజరుపేటకే చెందిన మంజుల, శ్రీలత ఆమె వద్దకు వెళ్లి తమకు జాకెట్లు కుట్టాలని మాట్లాడుతూ.. భూలక్ష్మి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.
NDL: ఈ వారంలో పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సంక్షేమ పథకాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలని ఈ మేరకు కలెక్టర్ ఆదేశించారు.
PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించగా, మహిళలకు చీరలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ‘అభ్యుదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే 100 రోజుల్లో జిల్లాను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పోలీసులు తెలిపారు.