E.G: కోరుకొండలోని MLA బత్తుల బలరామకృష్ణ కార్యాలయంలో శ్రీరంగపట్నం ప్రాంత రైతులతో ఆయన శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ప్రాంతంలో బురద కాలువ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను, కాలువ పూడిక నష్టాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యపై తక్షణమే స్పందించి, ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
VSP: హనుమంతవాక జంక్షన్ సమీపంలోని విశాఖ షిర్డీ సాయి సంస్థాన్‌లో జూన్ 2 నుంచి 4 వరకు సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి 9వ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ బి.వి. రమణకుమార్ తెలిపారు. మూడు రోజుల పాటు అభిషేకాలు, హోమాలు, ప్రవచనాలు, సత్సంగాలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 4న సాయి వ్రతం, మహా అన్నప్రసాద సంతర్పణ చేపట్టనున్నారు.
NDL: జూపాడు బంగ్లా ఆర్ అండ్ బీ ఏఈ తెలుగు రమేష్ బాబు రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఇవాళ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో శనివారం మదనపల్లె ఫిజికల్ హ్యాండీక్యాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై కృత్రిమ కాళ్లు, వీల్‌చైర్లు, చెవిటి యంత్రాలు తదితర పరికరాలను 53 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు.
KRNL: అనుమతులు లేని బళ్లారి, ధనలక్ష్మి రకం కందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు హెచ్చరించారు. పత్తికొండలో ఇవాళ ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి డీలర్లకు సూచనలు చేశారు. రైతులు లైసెన్సు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.
NTR: గత వారం రోజులు నుంచి నిర్విరామంగా దుర్గ గుడి ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు, బాటసారులకు, ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సమతం సత్తిబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన నేత బాడిత శంకర్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
SKLM: పొగాకు, మాదక ద్రవ్యాలు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని జిల్లా DMHO అధికారి డా కె.అనిత పిలుపునిచ్చారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ ని శనివారం నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలకు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాల పై అవగాహన కల్పించారు.
WG: తణుకు సబ్ జైలును నాలుగో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి సందర్శించారు. సబ్ జైలులో రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి మండల న్యాయ సేవలు కమిటీ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆమె వెంట వెంట బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
VSP: సింహాచలం సమీపంలోని అడవివరం శ్రీనివాస్‌నగర్‌తో పాటు 14 గ్రామాల పొలిమేర దేవతలుగా పూజలందుకుంటున్న శ్రీ సత్తెమ్మ తల్లి, మరిడిమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, ప్రసాద పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంఛార్జ్ జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2,68,564 మంది లబ్ధిదారులకు రూ.118,84,95,000 విలువైన నిధులు ఉన్నాయని వివరించారు. ఈ మేరకు జూన్ 1న వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
BPT: వీరన్నపాలెంలో జూదం ఆడుతున్న వారిపై పర్చూరు పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,310 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందిన సమాచారం మేరకు గ్రామంలోని జూద స్థావరంపై దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ELR: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం నెలకొన్న నేపథ్యంలో, ప్రకృతి వ్యవసాయం, నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన అవగాహన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. నవధాన్యాల సాగుతో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు.
PPM: గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఖరీఫ్-2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గిరిజన శాఖ మంత్రిసంధ్యా రాణి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్-2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో జనరల్ రాయితీ కింద 13,465 క్వింటాళ్లు, 90 శాతం రాయితీపై 8,883 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించారు.
WG: జిల్లాలో నిర్మాణం పూర్తయిన మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి కమిటీల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాబార్డ్ ఆధ్వర్యంలో మంజూరైన 24 గోడౌన్లలో 14 పూర్తయ్యాయని, ఏడు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో మూడు పనులు ప్రారంభం కావాల్సి ఉందని వివరించారు.
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇవాళ మాజీ సీఎం జగన్‌పై హాట్ కామెంట్ చేశారు. ఎంపీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆమె మాట్లాడారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పుకొచ్చారు. అనంతరం జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు నిలదీయాలని ఆమె పేర్కొన్నారు.