గుంటూరు జిల్లా నూతన PGRS భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని ప్రజల నుంచి 146 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుదారులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించగా, పోలీస్ సిబ్బంది సహకరించారు. ప్రజలు నిస్సంకోచంగా తమ సమస్యలు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.
W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సోషల్ అడిట్ బృందం సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేసింది. తాడేపల్లిగూడెంలోని వెంక్రమన్నగూడెం, రామన్నగూడెం, గ్రామలతో పాటు పెంటపాడు మండలం కోరుమిల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో 6 రోడ్లను సోషల్ అడిట్ బృందం పరిశీలించింది. నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసింది. సాంకేతిక నిపుణులు కొలతలను సేకరించారు.
VZM: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను సోమవారం జిల్లా కోర్టు విధించింది. తెర్లాం మండలానికి చెందిన హరికృష్ణపై ఆరోపణలు రుజువవడంతో రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేసింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
PLD: కలెక్టర్ కార్యాలయాన్ని భాష్యం పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కార్యాలయ పనితీరును తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని విభాగాల పనితీరు, ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల స్వీకరణ విధానం గురించి విద్యార్థులకు వివరించారు.
ATP: విరక్తి గవి మఠం ఉత్తరాధికారి నివాసం కోసం సొంత నిధులతో నూతన భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చారు. సోమవారం బసవ జయంతి సందర్భంగా కళ్యాణస్వామి సమక్షంలో ఆయన భూమిపూజ నిర్వహించారు. మఠం ఆస్తులు అన్యాక్రాంతం కావడంతో వసతి ఇబ్బందులు తలెత్తాయని, వీటిని పరిష్కరించేందుకు భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని సోమవారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
BPT: మండల కేంద్రమైన నిజాంపట్నం నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జీ. కిరణ్ బాబు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో స్నేహపూర్వకంగా ఉంటామని, శాంతిభద్రతల పరిరక్షణే తన మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
ప్రకాశం: ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జోన్-4 ప్రచార విభాగం విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. కనిగిరి ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని, ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నదని ఆరోపించారు.
కర్నూలు: విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. భూ వివాదంలో న్యాయం చేయాలని కర్నూలు, మేడం కాంపౌండ్‌కు చెందిన రామలక్ష్మమ్మ జిల్లా ఏస్పీకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
GNTR: వేసవి వేడిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆటో డ్రైవర్ దేవ తన సర్వీస్ ఆటోలో ‘మొబైల్ వాటర్ ట్యాంక్’ ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ A. హనుమంతు దీన్ని ప్రారంభించి ఆయన సేవా భావాన్ని అభినందించారు. ప్రతి ఏడాది ఇలా ముందుకు వస్తున్న దేవ సామాజిక బాధ్యతకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.
AKP: ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. పెదరామభద్రపురంలో సోమవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి పీఎండీఎస్ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలను పూతదశలో కలయదున్నితే భూమి సారవంతం అవుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు.
VSP: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల దాహార్తిని తీర్చేందుకు కేజీహెచ్ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. డైట్ కాంటీన్ ప్రవేశ ద్వారం వద్ద డైట్ కాంట్రాక్టర్ ఎస్. శ్రీనివాసరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి ప్రారంభించారు.
NTR: నందిగామలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
PPM: కాంగ్రెస్ ఇంఛార్జ్ బత్తిన మోహన్ రావు బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, దాంతో పాటు డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తేవడం ఒక “మాయా క్రీడ” అని ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పెను ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ ముందే గుర్తించారని తెలిపారు.
NLR: కంబాలదిన్నెలో మోపాడు రిజర్వాయర్ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డిలు ప్రారంభించారు. రూ.32.40 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 12,700 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. రైతులకు స్థిరమైన నీటి సరఫరా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.