ఎన్టీఆర్: విజయవాడలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ.220 పలుకుతుండగా, మటన్ కేజీ రూ.900కు చేరింది. చేపలు రకాన్ని బట్టి కిలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. 30 కోడి గుడ్ల ధర రూ.135గా ఉంది. సెలవు రోజు కావడంతో మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తున్నప్పటికీ, పెరిగిన ధరలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
VZM: రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్‌లుగా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్ జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు చీపురుపల్లికి చెందిన బంకపల్లి నిర్మలకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి లభించింది. దీనిపై గ్రామస్థులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జడ్జిగా పని చేస్తున్నారు.
SS: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన శాఖల ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ‘జలధార’, ‘స్వచ్ఛాంధ్ర’ వంటి కార్యక్రమాల్లో మంత్రులంతా భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు.
ATP: అనంతపురం నగరంలో మైనర్ డ్రైవింగ్ అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మైనర్ల తల్లిదండ్రులకు పరేడ్ మైదానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 215 మంది మైనర్లను గుర్తించి ఈ అవగాహన కల్పించారు. చిన్న వయసులో వాహనాలు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని డీఎస్పీ హెచ్చరించారు.
PPM: ఈ నెల 17న ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కలక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. ప్రతి నెల మూడవ శుక్రవారం ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
KDP: రాజుపాలెం(M) పర్లపాడులో మహేశ్ హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం SI ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, ప్రజలు మతసామరస్యాన్ని, శాంతిభద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు సృష్టించినా, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం: వెలిగండ్ల గ్రామపంచాయతీలో వారం రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చూడాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు రోజులకొకసారి అయినా నీటిని విడుదల చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
SS: కదిరిలోని బ్లూమూన్ విద్యాసంస్థల ప్రాంగణంలో నాలుగో రాష్ట్ర స్థాయి గోల్ షాట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరై జ్యోతిని వెలిగించి ఈ క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, క్రమశిక్షణకు తోడ్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
AKP: అచ్యుతాపురం KGBVలో ఏడవ తరగతి విద్యార్థిని మైలపల్లి నవ్య మృతి చెందిన ఘటనపై ప్రిన్సిపల్ ఉమా దేవితో పాటు నలుగురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. బాలిక మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కేజీబీవీ గేటు వద్ద ఆందోళన చేశారు. సస్పెండ్ అయినవారిలో ఎన్.ఎస్. టీచర్ సునీత, ఒకేషనల్ టీచర్ రూప, వాచ్ ఉమెన్ చిలకమ్మ, ఏఎన్ఎం ఈశ్వరి ఉన్నారు.
పల్నాడు: చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రజల వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తుండటంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. ప్రజలందరు గ్రీవెన్స్‌ను వినియోగించుకోవాలన్నారు.
ATP: జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతి బాపూలె గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఇవాళ పరీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు కొనకొండ్ల, కుందుర్పి, గోనబావి, నార్పల, డి.హీరేహాళ్ కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని జిల్లా కన్వీనర్ అస్రత్ వలి తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
CTR: శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కడప నగరంలో నీటి కాలుష్యంపై ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాకేశ్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకేజీ మరమ్మతు పనుల్లో ఆలస్యం జరిగినప్పటికీ, వాటిని వేగవంతం చేసి మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ELR: ద్వారకతిరుమలలోని విర్డ్ హాస్పిటల్‌లో క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలను శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విర్డ్ హాస్పిటల్ అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం అన్నారు. ఎముకల సంబంధిత చికిత్సలు, కృత్రిమ అవయవాల పంపిణీలో వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి కొత్త ఆశలు నింపుతున్నాయన్నారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు AMC వార్డును తనిఖీ చేశారు. ఎలక్ట్రికల్ పనులు, ఆక్సిజన్ ప్యానెల్ బోర్డుల అమరికను పరిశీలించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించి సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.