W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయం సమీపంలో PRTU ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి CPSను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ఇవ్వాలనీ కోరారు.
ELR: దేశవ్యాప్తంగా కార్మికులు ఈనెల 21న ‘డిమాండ్స్ డే’గా పాటించాలని ఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు ఇచ్చిందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.వి.రమణ అన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ టింబర్ డిపో వద్ద డిమాండ్స్ డే పాటించారు. నోయిడాలో కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులను నిలుపుదల చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు.
KDP: PGRS కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కారం చేయాలని కడప ఆర్టీవో మురళి తెలిపారు. ఇవాళ సిద్ధవటం MRO కార్యాలయాన్ని RDO తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రెవెన్యూ డికెటి పొలాలను ఆక్రమితకు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమితకు గురైన ప్రదేశాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని MROకు సూచించారు.
కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ మంగళవారం ఆఫీసర్స్ కాలనీలో పర్యటించి పారిశుద్ధ్యం పనులను తనిఖీ చేశారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వంటి వీవీఐపీలు నివసించే ప్రాంతాల్లో శానిటేషన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
అన్నమయ్య: ఓబులువారిపల్లి మండలం వై కోట గ్రామంలో జనసేన యువత ఆధ్వర్యంలో తొలిసారిగా జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర గారు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి జెండాను ఎగురవేశారు.
KRNL: ఆదోని ఎస్కేడి కాలనీలో ఇంటి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యర్థులు తనపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఫాతిమా ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళలపై దాడులు చేయడం హేయమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
PLD: నరసరావుపేట పట్టణం 30వ వార్డు ఆర్యవైశ్యుల TDP సీనియర్ కార్యకర్త ఆతుకూరి రామకృష్ణను 30వ వార్డు ఇంఛార్జ్ యూనిస్, 29వ వార్డు సెక్రటరీ బచ్చే మస్తాన్, 29వ వార్డు వైస్ ప్రెసిడెంట్ ముజీర్ పరామర్శించారు. కోట సెంటర్లోని లిఖిత హాస్పిటల్లో ప్రమాదవశాత్తు పడి కుడి బుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు.
E.G: రాజమండ్రి 16వ వార్డు తుమ్మగంట మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు వీధుల్లో ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా పాల్గొన్నారు.
NLR: కొండాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న చిమ్మిలి శ్రీనివాసులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని స్వగృహానికి తరలించగా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెళ్లి పూలమాలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ATP: రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో నియోజకవర్గ ఎలక్ట్రోల్ అధికారి రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 18 ఏళ్ల నిండిన యువతి యువకులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని శ్రీ సత్యసాయి కళాశాలలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మంగళవారం నిరసన చేపట్టారు. మహిళా మోర్చా నాయకురాలు సుభద్రమ్మ ఆధ్వర్యంలో విద్యార్థినులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్ప మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ కోసం సాగిన దశాబ్దాల పోరాటాన్ని ప్రతిపక్షం అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.
SKLM: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. సాంకేతికతను జోడించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
KRNL: ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ వద్ద ఇవాళ వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేసుకొని మంటలు ఆర్పారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయి నష్టం జరిగిందన్నారు. రోడ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని కోరుతున్నారు.
ప్రకాశం: ఈతకు వెళ్లకుండా మీ పిల్లలపై నిఘ ఉంచాలని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో మీ పిల్లలు మీ ప్రాంతాలలో ఉన్న బావులు, చెరువులు, వాగులు, ఉపాధి హామీ పథకంలో తవ్విన గుంటలలోకి ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. గతంలో చిన్నారులు మృతి చెందిన సంఘటనలను గుర్తు చేస్తూ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
సీతానగరం సువర్ణముఖి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంగళవారం చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు స్వామి వారి కండువా వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ స్వామి వారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారన్నారు.