ASR: దోమల వల్ల మలేరియా తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీ పరిధిలోని కందమామిడి వద్ద బుధవారం పలువురు ప్రజలకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమల నివారణకు దోమ తెరలు వాడాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రకాశం: నెల్లూరులోని ఆరోహ వనం హైడ్రోపోనిక్ యూనిట్‌ను సి.ఎస్.పురం కదిరి బాబు రావు వ్యవసాయ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం బీ.ఎస్.సీ (ఆనర్స్) వ్యవసాయ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ‘కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి సాంకేతికత’ కోర్సులో భాగంగా జరిగిన ఈ పర్యటనలో, నిపుణులు డాక్టర్ బసవరాజు హైడ్రోపోనిక్ పద్ధతులపై అవగాహన కల్పించారు.
కర్నూలు: 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారానికి అధికారులు కృషి చేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై ఛైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దడమే ప్రధాని లక్ష్యమన్నారు.
VZM: దత్తిరాజేరు మండలం ఎం. లింగాలవలసలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన కిలారి నాగ, రామారావు, సింగరావ్ కన్నయ్యలకు చెందిన మూడు గడ్డివాములు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. 80 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
VSP: మధురవాడలో అండర్‌గ్రౌండ్ కేబుల్ పనుల పేరుతో రోడ్లు తవ్వి వదిలేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంపాలెం ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించారు. 15 రోజుల్లో పూడ్చగలిగితేనే గోతులు తీయాలని, లేకపోతే పనులు ప్రారంభించవద్దని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
AKP: గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. గెడ్డపాలెం, కొరుప్రోలు తిమ్మాపురం తదితర గ్రామాల్లో బుధవారం పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. గ్రామాల్లో మురికి కాలువలను తరచూ క్లీన్ చేసి బ్లీచింగ్ వేయాలన్నారు. రహదారులపై చెత్త వెయ్యకుండా గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు.
KDP: నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించేలా, పార్టీ మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, CEC సభ్యుడు కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఫిర్యాదు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ATP: ఎన్.హెచ్ 544డి పరిధిలో నెలకొన్న భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోములదొడ్డి నుంచి బుగ్గ వరకు సాగుతున్న భూసేకరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుక్కరాయసముద్రం, సింగనమల, తాడిపత్రి తదితర మండలాల్లోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సత్యసాయి: ఆమడగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. PGRS, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మ్యుటేషన్లు, ఎఫ్-లైన్ దరఖాస్తుల స్థితిగతులను ఆయన పరిశీలించారు.
NLR: డయల్ యువర్ DM కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ డీ. ఆదినారాయణ బుధవారం తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు 9959225643 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని, సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
EG: ఉండ్రాజవరం (M)తాడిపర్రు గ్రామంలో సమగ్ర భూ కొలతలు పర్యవేక్షణ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి బుధవారం పర్యటించారు. బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, డంపింగ్ యార్డ్ కొరత, పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కిసాన్ మోర్చా నాయకులు కలెక్టర్‌ని శాలువ కప్పి సన్మానించారు.
W.G: ఉండి MRO ఆఫీస్‌లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జేసీ రాహుల్ బుధవారం పరిశీలించారు. గృహ, జనగణన డేటా సేకరణకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా గృహ జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని అన్నారు.
NDL: కొలిమిగుండ్లలో సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 10న చేపట్టే శాంతియుత ఆందోళనను జయప్రదం చేయాలని బేతంచర్ల మండల కార్యదర్శి యన్నా భార్గవ్ కోరారు. రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. సిమెంట్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, కాలుష్యంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
BPT: సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి-ఈటీ రోడ్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు అస్తవ్యస్తంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం పాత లైన్ వెనుక స్తంభాలు పాతాల్సి ఉండగా, రోడ్డు మార్గంలోకి వచ్చేలా వేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనివల్ల వర్షాకాలంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కాంతారావు పేర్కొన్నారు.
GNTR: గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజ్ రోడ్డులో ఉన్న వికాస్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ గుంటూరు జిల్లా బూత్ కమిటీ విశృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పార్టీ బలోపేతంపై సూచనలు చేశారు.