W.G: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో జి.గీతాబాయి హెచ్చరించారు. భీమవరంలోని కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, వాటిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు.
NTR: తిరువూరు గ్రంధాలయంలో ఉచిత శిక్షణా తరగతులలో భాగంగా విద్యార్థులు, తల్లితండ్రులకు సైబర్ నేరాల గురించి S.I గౌరీశ్వరి వివరించారు. విద్యార్థులు సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారో తల్లితండ్రులు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులపై తల్లితండ్రులు ఒత్తిడి తేకుండా వాళ్ళకు ఇష్టమైన కోర్సు చేయించాలన్నారు. రకరకాలుగా మోసాలు జరుగుతున్నందున జాగ్రత్త వహించాలన్నారు.
VSP: పెందుర్తి మండలం సంకల్ప కళా గ్రామంలో శనివారం SOS భీమిలి విద్యార్థులతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం సమావేశమయ్యారు. డ్రోన్‌ల ద్వారా చల్లేందుకు 6 మి.మీ పరిమాణంలో విత్తన గోళీలు తయారు చేయించి, వాటిని కొండలు, తీర ప్రాంతాల్లో చల్లి శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలని సూచించారు.
AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూ బాలుర హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ, పోలీసు, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వ సేవల వినియోగం, చట్టాలపై అవగాహన కల్పించారు. తమ హక్కులను తెలుసుకోవాలని అధికారులు అన్నారు.
సత్యసాయి: తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ ఎస్సీ కాలనీలో వేసవి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పంచాయతీ నిధులతో ఇక్కడ కొత్త బోరు వేయించి, నూతన మోటార్ ఏర్పాటు చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి,మాధవరం-1 పార్వతీపురం వద్ద శనివారం కడప నుంచి తిరుపతికి వెళుతున్న కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది మరొక బస్సులో ఎక్కించి గమ్యానికి పంపించారు. బస్సులో ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
VZM: జిల్లాలోని ఎస్.కోట మండల పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన జిందాల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనకు రాష్ట్ర పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన శనివారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ఋలతో నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ATP: గుత్తి మండలం తురకపల్లి గ్రామ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుడి ఆచూకీ లభించింది. మృతుడు తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన మంగలి ధనుంజయగా గుర్తించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
CTR: రొంపిచర్ల, పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్ స్టేషనులను SDPO వెంకటనారాయణ శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు. మహిళల నేరాలు, సైబర్ నేరాలను అరికట్టడం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
KDP: పాములూరు గుట్టలో తాము అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన అనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు, రవాణా చేపడుతున్నామని లీజుదారులు వీరభద్రుడు, రమేశ్ తెలిపారు. శనివారం వేంపల్లె CI నర్సింహులును కలిసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వినతిపత్రం అందజేశారు. అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.
అన్నమయ్య: ములకలచెరువు మండలంలో చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని మండల DY.MPDO మోహన్ ప్రతాప్ పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని కదిరినాథునికోట, నాయునిచెరువుపల్లె పంచాయితీల్లోని చెత్త సంపద కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్ నాయక్, విశ్వనాధ్ పాల్గొన్నారు.
NTR: మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్ నాశనం కాకూడదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, CPఎస్‌వీ రాజశేఖర బాబు పిలుపునిచ్చారు. విజయవాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో మాదకద్రవ్యాల నియంత్రణ, హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
KRNL: ఆదోనిలో డీఎస్ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో శనివారం నారాయణ పాఠశాలపై ధర్నా నిర్వహించారు. సెలవు రోజుల్లో ఉపాధ్యాయులతో అడ్మిషన్ ప్రచారం చేయించడం, అధిక ఫీజులు వసూలు చేయడం, ఒలింపియాడ్‌లు, టెక్నో కోర్సుల పేరుతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
BPT: చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శనివారం ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం కారంచేడు రోడ్డు నుంచి సెయింట్ ఆన్స్ హై స్కూల్ వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డేనియల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
W.G: కాళ్లకూరు శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం మాడవీధుల విస్తరణ కోసం భక్తులు ఉదారంగా స్పందించారు. కలవపూడికి చెందిన పెన్మెత్స దుర్గాప్రసాదరాజు- శ్రీదేవి, వేగేశ్ హేమంత్ సూర్యనారాయణరాజు -జ్యోతిర్మయి, దాట్ల కృష్ణరోహిత్ -చామంతికిరణ్మయి దంపతులు రూ. 2,11,116 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ స్వీకరించారు.