VSP: విశాఖ మురళీనగర్ సెక్టార్-11లో ట్రెక్కింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దివంగత కె. త్రిపురసుందరరావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాదచారులు, కార్మికులకు ప్రతిరోజూ మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఈ చలివేంద్రం 50 రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
AKP: కోటవురట్ల మండలం గొట్టివాడలో పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NDL: ప్యాపిలి పట్టణంలో గత ఎనిమిది రోజులుగా తీవ్రమైన నీటి కష్టాలు నెలకొన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేసేందుకు ప్రజలు రూ.300–రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటి పన్ను వసూలు చేసే సమయంలో వచ్చే అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
GNTR: మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు 30వ వార్డులో కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. సిల్ట్ పూర్తిగా తొలగించి వెంటనే తరలించాలని సూచించారు. కాలువల్లో చెత్త వేయొద్దని హెచ్చరించారు. 34వ వార్డులో గృహనిర్మాణ కేంద్రం, వీఎస్ఆర్-ఎన్వీఆర్ కాలేజీ సమీపంలోని నీటి సరఫరా కేంద్రాన్ని తనిఖీ చేసి నాణ్యతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
తూ.గో: రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మంగళవారం సీతారాంపురంలో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
SKLM: అరసవల్లి గ్రామ దేవత అసిరితల్లి పండుగలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం కమిటీ సభ్యుల ఆహ్వానం మెరకు ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్ కూన రవికుమార్ హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
TPT: TTD కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టు 36 మందిపై దాఖలైన ఛార్జ్ షీట్లను స్వీకరించింది. మొదటి విడతలో 14 మందిని, రెండో విడతలో మిగిలిన వారిని విచారించనుంది. 3 డైరీ సంస్థల యజమానులు, TTD ఉద్యోగులు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో బోలెబాబా, వైష్ణవి, AR డెయిరీ సంస్థలపై కమీషన్ల కోసం TTDకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
NDL: డోన్ పట్టణంలో రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (BLA)తో ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 3 గంటలకు మునిసిపల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన BLAలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
CTR: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తుంగభద్ర వారియర్స్ టీంకు చిత్తూరు నగరానికి చెందిన జి.వి.చరణ్ జిత్ ఎంపికయ్యారు. ఈయన నగరంలోని క్రీడా ప్రాంగణంలో రైట్ హ్యాండ్ బ్యాటింగ్, ఆఫ్ స్పిన్నర్‌గా శిక్షణ పొందారు. చిత్తూరు జిల్లా నుంచి తుంగభద్ర టీంకు ఎంపిక కావడం గర్వకారణమని చరణ్ తెలిపారు.
W.G: పెట్రోల్, డీజిల్ కొరత అంతా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం తణుకులోని పలు పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి వాహనదారులకు మజ్జిగ అందజేశారు. డీజిల్ లేక రైతులు, వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ: చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డి దారుణ హత్యను కొత్తపేటకు చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి, మండల అధ్యక్షుడు గనిశెట్టి వీరేష్ తదితర నాయకులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దురాగతాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
నెల్లూరు: మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకుని మంగళవారం తెల్లవారుజామున చనిపోయాడు. వ్యక్తి వయసు సుమారు 75 సంవత్సరాలు ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని చని పోయాడా లేక ప్రమాదవశాత్తు రైలు నుండి బడి చనిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది.
ATP: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ మంగళవారం అనంతపురం నగరంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంగమేష్ సర్కిల్ వద్ద ఇంధన నిల్వలు, విక్రయాలను పరిశీలించి వాహనదారులతో నేరుగా మాట్లాడారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, నేడు సాయంత్రానికి మరో 42 లోడ్ల స్టాక్ అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
KDP: ఖాజీపేట(M) సుంకేసుల గ్రామంలో మే 5వ తేదీన రీసర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రమణమ్మ మంగళవారం తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, తమ ఆధార్ కార్డు తప్పకుండా సర్వే సమయంలో కలిగి ఉండాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సత్యసాయి: ABN ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ మోహనరెడ్డి హత్యను ఖండిస్తూ గోరంట్ల జర్నలిస్టులు మంగళవారం తహశీల్దార్ మధుసూదన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ కీలక పాత్ర పోషిస్తున్న విలేఖరులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. నిందితులను శిక్షించి విలేఖరికి న్యాయం చేయాలని కోరారు.