NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ అన్ని బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకులకు వచ్చిన వాహనదారులు వెనుదిరిపోతున్నారు. దీంతో ఆటో వాలాలు, వ్యవసాయంపై ఆధారపడిన టాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి డీజల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సత్యసాయి: రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ గాజుల ఆదెన్న ఆదివారం ఉదయం 11.00 గంటలకు లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ దర్శనం అనంతరం అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆయన పర్యటన సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా చేపట్టారు.
KKD: పెద్దాపురం మండలంలోని పెట్రోల్ బంక్లో తహశీల్దార్ వెంకటలక్ష్మి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తహశీల్దార్ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట, పులిమేరు, వడ్లమూరు పెట్రోల్ బంకులను తహశీల్దార్ పరిశీలించారు.
W.G: మొగల్తూరుకు చెందిన అలపాటి రాజేశ్ (31) ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ, శనివారం బ్రెయిన్ డెడ్ అవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ రాజేశ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. తద్వారా మరికొందరికి ప్రాణభిక్ష పెట్టి రాజేశ్ ఆదర్శంగా నిలిచారు.
SKLM: నరసన్నపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు మే 9న పర్యటించనున్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. జలుమూరు మండలం అక్కు రాడ గ్రామంలో నిర్వహించనున్న “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
KRNL: ఆస్తి పన్ను రాయితీతో చెల్లించేందుకు మరో నాలుగు రోజుల మాత్రమే గడువు మిగిలి ఉందని శనివారం కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి పన్నుతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మన్యం: గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన నాగావళి కాలువ వంతెన ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ వంతెన మీదుగా సాంబన్నవలస, మరుపెంట, సీమలవానివలస గ్రామాల ప్రజలు, రైతులు పంట పొలాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన శిథిలావస్థ కారణంగా ఎప్పుడైనా కూలిపోతుందేమోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ చేపట్టిన “మన గ్రామానికి మన శైలజానాథ్” కార్యక్రమం నేడు ఏడవులపర్తిలో జరగనుంది. సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శైలజానాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ క్యాంపు కార్యాలయం కోరింది.
విశాఖ: ఆర్కే బీచ్లో ఆదివారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సుమారు 68 ఏళ్ల వయసున్న మహిళ సముద్రంలో మునిగిపోతుండగా గుర్తించిన లైఫ్ గాడ్స్ ధనరాజ్, ఆనంద్ వెంటనే ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
TPT: శ్రీవారికి పెరుగు, వెన్న, మీగడ, శొంఠి చూర్ణంతో ఇచ్చే ‘మాత్రా ప్రసాదం’ వెనుక సైన్స్ దాగుంది. ఈ ప్రసాదంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పెరుగు తీసుకోవడంతో మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా, వెన్నతో వీర్యవృద్ధి ప్రాప్తి కలుగుతుందట. మీగడతో కంటిచూపు, శొంఠితో జీర్ణ వ్యవస్థ వృద్ధి, తగినంత ఉప్పుతో బీపీ కంట్రోల్ అవుతుంది.
ASR: రాజవొమ్మంగి జాతీయ రహదారిపై శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒట్టిగెడ్డ సమీపంలో గంగవరం మండలం మర్రిపాలెంకు చెందిన రవికిశోర్ రెడ్డి (21), శేఖర్ గోపాల్ రెడ్డి బైక్పై వెళ్తుండగా పశువులు అడ్డువచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన రవికిశోర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన గోపాల్ రెడ్డిని అడ్డతీగల ఆసుపత్రికి తరలించారు.
E.G: నేర రహిత సమాజానికి ప్రజలు సహకరించాలని ధవళేశ్వరం CI టి. గణేశ్ కోరారు. శనివారం సాయంత్రం ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టరేట్ వెనుక ఉన్న టిట్కో ఇళ్ల వద్ద పోలీసుల బృందం కార్డాన్ సెర్చ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో 400 మందిని విచారించి, 100 వాహనాలను తనిఖీ చేశారు. పత్రాలు లేని 24 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
విజయనగరం: గొడిపాలెం-పేడాడ-బంటుపల్లి మార్గంగా భోగాపురం వెళ్లే రహదారి గుంతలతో పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
GNTR: ‘జన గణన -2026’పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తెనాలిలో ఆదివారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన 5కే రన్ ప్రదర్శనను ఎమ్మార్వో గోపాలకృష్ణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామారావు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ రన్ సాగింది. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
KKD: తుని నుంచి కాకినాడ వరకు జాతీయ రహదారిపై పలు పెట్రోల్ బంకులు డీజిల్ లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడంతో లారీలు, బస్సులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లినా ఇంధనం దొరకడం లేదని, వ్యవసాయ యంత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు.