ప్రకాశం: అర్ధవీడు మండలానికి చెందిన బైనముక్కల రాకేష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. శుక్రవారం స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం అతను కనిపించకుండా పోయినట్లు బాలుడి తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఇప్పటికే అర్ధవీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే దయచేసి 7032669045 నంబర్‌కు సమాచారం అందించాలని బాలుడి తల్లి విజ్ఞప్తి చేసింది.
GNTR: ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడు గ్రామ పరిధిలోని NSP కాల్వ లాకుల వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు సుమారు 40-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని ఎడమ చేతిపై “ఫరోన్ ఇమాన్ షా” అనే పచ్చబొట్టు ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక BMS క్లబ్ ఆవరణలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు.
KRNL: మంత్రాలయం మండల పరిధిలోని కలుదేవకుంట గ్రామంలో పట్ట పగలే దొంగలు ఓ ఇంట్లో రూ.50 వేల నగదును చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్ తెలిపారు. శనివారం ఉదయం తన అన్న కుమారుడికి సంబంధం మాట్లాడేందుకు గ్రామంలోనే తన అన్న ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును దోచుకున్నట్లు బాధితుడు తెలిపాడు.
KDP: సి.కె దిన్నె పరిధిలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో ఊటుకూరు సర్కిల్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్, ఓవర్ స్పీడ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
W.G: జిల్లాలోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను మరో ఏడాది అనగా 2026-27కు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీవోఎంఎస్ 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SKLM: సరుబుజ్జిలికి చెందిన భద్ర రామారావును వైసీపీ ఆర్టీఐ విభాగం స్టేట్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకానికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైసీపీ ఆర్టీఐ వింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఆర్టీఐ విభాగ రాష్ట్రస్థాయి సమావేశంలో శనివారం అభినందనలు తెలిపారు.
PPM: నీలకంఠాపురం ప్రధాన రహదారిపై ఎస్సై నీలకంఠ రావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
W.G: భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారు 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను శనివారం సంప్రదాయ బద్దంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకుని వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 8 రోజులపాటు కల్యాణోత్సవం, గరుడోత్సవం, వైభవోత్సవం, రథోత్సవం, ఉంజల సేవలు జరుగుతాయి అన్నారు.
KDP: గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో మే 8వ తేదీ నుంచి జరిగే మహాకుంభాభిషేక కార్యక్రమ నిర్వహణకు టెండర్లు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో గురుప్రసాద్ తెలిపారు. మహా కుంభాభిషేకం సందర్భంగా షామియానాలు, పందిర్లు, బారికేడ్ల ఏర్పాటు, లైటింగ్ డెకరేషన్, స్వాగత ఆర్చులు తదితర పనులకు టెండర్లను పిలుస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: స్వచ్ఛతకే తొలి ప్రాధాన్యత ఇస్తూ నగరంలో 100 శాతం ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మంజూరు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఆయన ప్రారంభించారు. రహదారులు, డ్రైనేజీ కాలువల్లో చెత్త వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో యువగళం టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
NDL: ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో ABN సంస్థల అధినేత రాధాకృష్ణపై శనివారం మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి, వైసీపీ నేత భూమా కిశోర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ప్రసారమైన కార్యక్రమంలో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని అంతమొందిస్తామంటూ వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులపై శనివారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మవరం సీఐ ప్రభాకర్ గౌడ్‌ను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకత్వ ప్రోత్సాహంతోనే తనపై ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
GNTR: తెనాలిలో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇవాళ సోలార్ హెల్మెట్లు పంపిణీ చేశారు. సోలార్ ద్వారా చల్లదనం కలిగించే ఫ్యాన్లతో ఉన్న 40 హెల్మెట్లను అందించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు దివంగత నేతి పరమేశ్వర శర్మ కుమారుడు, కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ప్రిన్సిపల్ చలపతి దంపతులు వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో వన్ టౌన్, టు టౌన్ సీఐలు పాల్గొన్నారు.