KDP: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టసభల్లో ఆమోదం లభించిన సందర్భంగా కడప నగరంలోని పాలెంపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. MLA మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
సత్యసాయి: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురం విచ్చేసిన బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాను మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. తిరువనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై నడ్డాకు నివేదిక సమర్పించారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టి ప్రతి ఓటరును చేరుకునేలా పటిష్ట ప్రణాళికలపై చర్చించారు.
CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.148 నుంచి రూ 154, మాంసం రూ. 215 నుంచి రూ. 246 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.244 నుంచి రూ.271 వరకు విక్రయిస్తున్నట్లు దుకాణ యజమానుదారులు తెలిపారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.66 ఉంది.
కోనసీమ: ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఇటీవల హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 86 మందికి రూ.42.14 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి . ఆ చెక్కులను శనివారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందజేశారు
ప్రకాశం: 2026 ఫిబ్రవరిలో PHC పనితీరుకు ప్రభుత్వం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో జిల్లాకు 16వ స్థానం దక్కింది. జిల్లాలో 39 PHCలు ఉండగా A గ్రేడ్‌లో 3, B గ్రేడ్‌లో 22, C గ్రేడ్‌లో 11, D గ్రేడ్ 3 సాధించాయి. OP, IP సేవలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న PHCల రికార్డుల ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.
తిరుపతి నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్యను 50 నుంచి 66కు పెంచుతూ జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్ 9లోగా ముసాయిదా సిద్ధం చేసి, 10 నుంచి 16 వరకు ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
NLR: నెల్లూరుకు చెందిన జేపీ సంజన ఏప్రిల్ 14న పార్లమెంట్లో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగించనున్నారు. ‘మై భారత్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపికైన 12 మందిలో ఈమె ఒకరు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీల్లో సత్తా చాటి ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో ఇవాళ రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.
KRNL: డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని DMHO డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎస్ఆర్ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రోజులుగా టన్నుపై రూ.1000 చొప్పున ధర క్షీణిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం జరిగిన విక్రయాల్లో టన్ను గరిష్ఠ ధర రూ.21 వేలు పలకగా, కనిష్ఠం రూ.8 వేలకు పడిపోయింది. మార్కెట్ యార్డుకు 990 టన్నుల దిగుమతి వచ్చినట్లు కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు.
W.G: పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం బరియల్ గ్రౌండ్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈస్టర్ పండుగ వేడుకలను క్రైస్తవ సోదరీ సోదరీమణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద దీపాలు వెలిగించి పూలతో ప్రత్యేకంగా అలంకరించి వారి పూర్వీకులకు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ELR: చింతలపూడి నియోజవర్గానికి కేటాయించిన బడ్జెట్‌పై స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం నియోజకవర్గంలోని కూటమి నాయకులతో చర్చించారు. ప్రభుత్వం మండలాల వారీగా ఇచ్చిన కేటాయింపులకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు రూపొందించుకొని పూర్తిస్థాయిలో సద్వినియోగం జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
NDL: ఉయ్యాలవాడ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు శనివారం తెలిపారు. సర్పంచుల పదవీకాలం ఈనెల 2తో ముగియడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్ ప్రసాద్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో నాగలక్ష్మమ్మ, పశువైద్యాధికారి సాయిబాబాలను కలెక్టర్ నియమించినట్టు ఆయన వెల్లడించారు.
అన్నమయ్య: మదనపల్లెలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఎస్టేట్ సమీపంలోని దాము వైన్స్‌లో మద్యం తాగేందుకు వెళ్లిన శివసాయి(28) అనే యువకుడిపై సుమారు 15 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం షాపు వద్ద జరిగిన చిన్న వివాదం కారణంగా ఆగ్రహించిన దుండగులు బీరు బాటిళ్లతో శివసాయి తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించి గరుడ పటాన్ని అవతనం చేశారు.బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధి పొందుతారని ఐతిహ్యం. సకల శ్రేయస్సులు కలుగుతాయని విశ్వాసం.