VZM: బొబ్బిలి మండలం పక్కీ గ్రామంలోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ, వర్షాకాలంలో నీరు కారడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా చర్యలు లేకపోవడంతో, సిబ్బంది భయం గుప్పట్లో విధులు నిర్వహిస్తున్నారు.
ELR: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం ఏలూరులో ఇంఛార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్ల పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు, ముఖ్యంగా రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో ఎండాకాలంలో దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇళ్లు ఖాళీగా ఉండే సమయంలో నాణ్యమైన తాళాలు వేసుకోవడం, విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచడం, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్సై జె. నరసింహారెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 9121100556 లేదా 100/112 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
PLD: నరసరావుపేటలోని కైలాష్ ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఇవాళ జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన నిల్వలు, నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఇంధన సరఫరాలో పారదర్శకత, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం అత్యంత ముఖ్యమని జేసీ స్పష్టం చేశారు.
ప్రకాశం: టంగుటూరు మండలం బాబూజీ కాలనీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సా నుంచి పాండిచ్చేరికి సిల్వర్ పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్.ప్రకాష్ జైన్ ఇవాళ వికలాంగుల మధ్యలో తమ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగుల పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో సుమారుగా 500 మందికి పైగా పేదలకు అన్నప్రసాదం అందజేశారు. సేవా భావంతో జరిగిన ఈ కార్యక్రమంతో ప్రశంసలు అందుకున్నారు.
KDP: సరోజినీ నగర్‌లోని టిడ్కో గృహాలను తక్షణమే నివాసయోగ్యంగా మార్చాలని సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సీపీఎం నేతలు గృహాలను సందర్శించారు. విద్యుత్, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉండటంతో లబ్ధిదారులు అక్కడ నివసించేందుకు ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు. దొంగతనాలు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.
KDP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తమకు కూలీలు సమయానికి అందడం లేదని పలువురు శ్రామికులు ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతనాలు మంజూరు చేసింది. డిసెంబర్ 12 నుంచి మార్చి వరకు వేతనాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి త్వరగా వేతనాలు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి శ్రామికులు కోరుతున్నారు.
AKP: నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద అర్థరాత్రి ఘటనపై జనసేన ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వీధి రౌడీలా వ్యవహరించారని ఆరోపించారు. సృష్టి క్షేత్రం పనులను అడ్డుకోవడం, లారీని ఆపడం, సిబ్బందిని భయపెట్టడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటన శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని పెర్కొన్నారు.
VSP: విశాఖలో 1 గిగావాట్ హైపర్స్కల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో భారత్ ఏఐ రంగంలో ముందడుగు వేసిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ మంగళవారం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో డిజిటల్ ఇన్ఫ్రా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఇప్పటివరకు ముంబై, చెన్నైకే పరిమితమైన ఈ సెంటర్లు విశాఖకు విస్తరించడం కీలకమని, దీనివల్ల నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు.
PPM: పీలేవిడి గ్రామ సమీపంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్‌ను ఒక్కో వాహనానికి రెండు లీటర్ల పరిమితికి మించి ఇవ్వకూడదని స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జయకుమార్ ఆదేశించారు. ఈ మేరకు పెట్రోల్ బంక్ యజమానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇంధన కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నియంత్రణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన గోశాలలో ఈవో పెంచల కిశోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గోవులకు సమయానికి మేత, పశుగ్రాసం, తాగునీరు అందించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తాపాన్ని తగ్గించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోశాలను పరిశుభ్రంగా ఉంచుతూ, గోవుల ఆరోగ్యంపై పశువైద్యుడి పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ అనారోగ్యంతో మృతి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ చంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం పోతుకుంట ఆసుపత్రిలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం కొనసాగుతోంది. సంస్కృతి సేవా సమితి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మొదటి రోజే 102 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 29న మంత్రి స్వయంగా పాల్గొని జైపూర్ ఫుట్ పరికరాలు, ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నారు.
ప్రకాశం: బల్లికురవ మండలం రామాంజనేయపురంలో ఓ వివాహిత ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. సంతమాగులూరు ఏల్చూరుకు చెందిన ప్రసన్నకుమార్ ప్రియురాలిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. వారం క్రితం హత్యకు గురైన రజిని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. తాజా దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది.