VSP: మద్దిలపాలెంలోని శ్రీ భావన విద్యానికేతన్‌లో ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం మాట్లాడారు. ఎర్త్ డే అనేది సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసే రోజు అని పేర్కొన్నారు. భూమిపై ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ముప్పు అని హెచ్చరించారు.
AKP: అనకాపల్లి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో 13వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని డీపో అసిస్టెంట్ మేనేజర్ గౌరి ఇవాళ ప్రారంభించారు. ప్రతి బ్యాచ్‌లో 16 మందికి 40 రోజులపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. డ్రైవింగ్ నైపుణ్యాలతో పాటు ఫైర్ సేఫ్టీ, మెకానికల్ ట్రైనింగ్ కూడా అందిస్తామని చెప్పారు. అనంతరం శిక్షణార్థులకు డ్రైవింగ్, సిగ్నల్, థియరీ పుస్తకాలు అందజేశారు.
ATP: తాడిపత్రి నియోజకవర్గంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న 35 కుటుంబాలకు MLA జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.18,94,242 నిధులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 526 మందికి రూ.3,94,43,766ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వృద్ధులు, దివ్యాంగులతో కూర్చొని వారి సమస్యలను శ్రద్ధగా విని ధైర్యం చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. దీంతో స్థానికులు మంత్రి శైలిని ప్రశంసించారు.
VZM: రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తన ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ.50 లక్షలతో గోషా ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ నూతన సదుపాయాలను ఇవాళ ఎమ్మెల్యే అదితి అధికారికంగా ప్రారంభించారు. నిధులు మంజూరు చేసిన విజయేంద్ర ప్రసాద్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.
CTR: ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్‌లో మహాభారత ఘట్టాల్లో ఒకటైన అర్జున తపస్సు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ తపస్సు కార్యక్రమం ద్వారా అర్జునుడు చేసిన దీక్ష, భగవంతునిపై భక్తిని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
KRNL: ఆదోని ఎస్కేడీ కాలనీలో ఇంటి స్థలం హద్దుల వివాదంలో ఫాతిమా అనే మహిళపై దాడి జరిగినట్లు టూ టౌన్ ఎస్ఐ రామనాథ్ తెలిపారు. బాధితురాలు ఎమ్మెల్యేను ఆశ్రయించగా, ఆయన నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏరకుల రంగన్న సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్థల వివాదంపై దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం: కొండపి సీఐ సోమశేఖర్ చీరాల వన్ టౌన్ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. కొండపిలో సోమశేఖర్ బాధ్యతల చేపట్టాక నేరాలు కట్టడి చేయడంతోపాటు, పేకాట బెట్టింగులపై ఉక్కుపాదం మోపారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి కృషి చేశారు. ఆయన సర్వీస్ కాలంలో అందరి అభిమానాలు పొందారు. సర్కిల్ పరిధిలో సమస్యలను పరిష్కరించడంలో మంచిపేరు తెచ్చుకున్నారు.
PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మాజీ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్, ఉప సర్పంచ్ కిషోర్‌లకు ఆర్టీసీ షాప్ ల యూనియన్ సభ్యులు ఎద్దు మురళి, నారా సురేష్, నెమలిపురి మురళి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి వ్యాపారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి సేవలను ప్రశంసించారు.
VZM: జిల్లాలో నిర్వహించబోయే వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్)లకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సిహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో వివిధ శాఖల ప్రతినిధులు మరియు కళాశాలల నిర్వాహకులతో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. పాఠశాల రక్షణకు ప్రహరీ గోడ ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ELR: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ కామవరపుకోట మండలానికి చెందిన 53 మంది VOAలకి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమని అన్నారు.
అన్నమయ్య: జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కంచాలమ్మ గండి చెరువును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. మాండవ్య నది శుభ్రత, చెక్‌డ్యాముల నిర్మాణం, సప్లై ఛానల్ మరమ్మతులతో నీటి నిల్వ పెంచాలని మంత్రి సూచించారు. సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: పరిగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీతోపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. శక్తి యాప్, 100, 112 వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
BPT: శ్రీలంకలో జరిగే గోల్ షాట్ బాల్ పోటీలకు బాపట్ల విద్యార్థి ఎంపికయ్యాడు. మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న గోదావరి మహిమ రాజు.. భారత జూనియర్ బాలుర జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 24 నుంచి 28 వరకు కొలంబోలో ఈ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల అతడిని హెచ్‌ఎం, పీడీ కత్తి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.