కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరుకావాలని ఆమె కోరారు.
ప్రకాశం: పొదిలి మండలం పిచ్చిరెడ్డి తోట కాలనీలో సోమవారం సీఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అలానే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజలను హెచ్చరించారు.
గుంటూరు: దుగ్గిరాలలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తెనాలికి చెందిన నారేపాలెం నాగరాజు విజయవాడ కేశఖండన శాలలో పనిచేసేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి గాయమైంది.
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో సోమవారం సాయంత్రం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను, వినతులను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
KDP: పులివెందుల రూరల్ సీఐగా పనిచేస్తున్న సీతారామిరెడ్డి రెడ్డిని నంద్యాల డీటీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో రూరల్ ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న శాంతిలాల్‌ను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పులివెందుల ట్రాఫిక్ సీఐగా మంత్రాలయంలో పనిచేస్తున్న రామాంజులను నియమించారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
CTR: డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ ఒక ప్రటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పల్నాడు: జిల్లాలోని కొండవీడు కోటపై అటవీశాఖ ప్రత్యేకంగా నైట్ క్యాంపింగ్‌ను ప్రారంభించింది. టెంట్లలో రాత్రి బస, క్యాంప్ ఫైర్, మ్యూజికల్ నైట్, ఉదయపు సూర్యోదయ వీక్షణ వంటి ఆకర్షణలు ఉంటాయి. పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1000గా ఫీజు నిర్ణయించారు. ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలు కూడా ఏర్పాటు చేశారు.
తిరుపతి: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న తిరుపతి మహతి కళాక్షేత్రంలో విశేష ధార్మిక ప్రవచనం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువలు& ధార్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ప్రవచనం ఇవ్వనున్నారు.
ATP: పెన్నానది ఆక్రమణల ఆరోపణలపై తాడిపత్రి మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ రక్షణ కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఆక్రమణలుగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతులతోనే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ పనులు చేపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
KRNL: ఆదోనిలోని జంకన్వాడీ కాలనీకి చెందిన అమిన్ అస్వో (39) క్యాన్సర్, అల్సర్ వంటి అనారోగ్యాలతో మనస్తాపానికి గురై ఈనెల 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి కర్నూలుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KDP: ప్రొద్దుటూరు లింగాపురంలో సహజీవనం సాగిస్తున్న రామాంజనేయులు, ప్రమీల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు భర్త ఐజాక్, ఇటు బంధువులు రాలేదు. పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె మృతదేహం ప్రొద్దుటూరు ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. మున్సిపాలిటీ, స్వచ్ఛంద సంస్థల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం రామానాయుడుపేట నుంచి ఐదు రోడ్ల సెంటర్ వరకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ సోమవారం పాల్గొని, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెత్తాచెదారాన్ని ఎక్కడబడితే అక్కడ వేయరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
TPT: తిరుపతిలో ఆదివారం గంజాయి పట్టుబడింది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఉమాపతి, ధనలక్ష్మి దంపతులు దామినేడుకు వెళ్లారు. అక్కడ జోసెఫ్ వద్ద గంజాయి తీసుకుని, బైకుపై తిరుపతికి తెస్తుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10కేజీల గంజాయి, బైక్, రూ.22,900, ఫోన్లు, బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్ బాబ్జీ నిర్మాణంలో ఉన్న పలు కట్టడాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో, సరైన వేతనాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. నిర్మాణంలో భవనాలకు విధిగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
బాపట్ల: వేసవి ఎండలు ముదురుతున్న వేళ గ్రామ ప్రజల అవసరాల కోసం సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు పంచాయతీలో ఈరోజు రెండు కొత్త చేతి పంపు బోరు బావులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విజయ్ బాబు మాట్లాడుతూ.. గ్రామస్తులకు తాగునీటి కష్టాలు కలగకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.