SKLM: నరసన్నపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు మే 9న పర్యటించనున్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. జలుమూరు మండలం అక్కు రాడ గ్రామంలో నిర్వహించనున్న “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
మన్యం: గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన నాగావళి కాలువ వంతెన ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ వంతెన మీదుగా సాంబన్నవలస, మరుపెంట, సీమలవానివలస గ్రామాల ప్రజలు, రైతులు పంట పొలాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన శిథిలావస్థ కారణంగా ఎప్పుడైనా కూలిపోతుందేమోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ చేపట్టిన “మన గ్రామానికి మన శైలజానాథ్” కార్యక్రమం నేడు ఏడవులపర్తిలో జరగనుంది. సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శైలజానాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ క్యాంపు కార్యాలయం కోరింది.
విశాఖ: ఆర్కే బీచ్‌లో ఆదివారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సుమారు 68 ఏళ్ల వయసున్న మహిళ సముద్రంలో మునిగిపోతుండగా గుర్తించిన లైఫ్ గాడ్స్ ధనరాజ్, ఆనంద్ వెంటనే ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ASR: రాజవొమ్మంగి జాతీయ రహదారిపై శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒట్టిగెడ్డ సమీపంలో గంగవరం మండలం మర్రిపాలెంకు చెందిన రవికిశోర్ రెడ్డి (21), శేఖర్ గోపాల్ రెడ్డి బైక్‌పై వెళ్తుండగా పశువులు అడ్డువచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన రవికిశోర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన గోపాల్ రెడ్డిని అడ్డతీగల ఆసుపత్రికి తరలించారు.
E.G: నేర రహిత సమాజానికి ప్రజలు సహకరించాలని ధవళేశ్వరం CI టి. గణేశ్ కోరారు. శనివారం సాయంత్రం ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టరేట్ వెనుక ఉన్న టిట్‌కో ఇళ్ల వద్ద పోలీసుల బృందం కార్డాన్ సెర్చ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో 400 మందిని విచారించి, 100 వాహనాలను తనిఖీ చేశారు. పత్రాలు లేని 24 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
విజయనగరం: గొడిపాలెం-పేడాడ-బంటుపల్లి మార్గంగా భోగాపురం వెళ్లే రహదారి గుంతలతో పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
KKD: తుని నుంచి కాకినాడ వరకు జాతీయ రహదారిపై పలు పెట్రోల్ బంకులు డీజిల్ లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడంతో లారీలు, బస్సులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లినా ఇంధనం దొరకడం లేదని, వ్యవసాయ యంత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం జరిగిన సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 578 మందికి 490 మంది విద్యా ర్థులు హాజరు కాగా, 87 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. వ్యాపారుల సమాచారం మేరకు స్కిన్‌తో చికెన్ కేజీ రూ.181, స్కిన్‌లెస్ చికెన్ రూ.206గా విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కేజీ రూ.700కు, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు.
ATP: జిల్లాలో డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా చేయాలని సంబంధిత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లకు తెలియజేశామన్నారు.
NLR: మనుబోలు మండలంలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. గూడూరకు చెందిన వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి బైక్‌పై నెల్లూరుకు వెళ్తుండగా హైవేపై కొండూరు సత్రం పవర్ గ్రిడ్ ఎదురుగా బైకును వెనక నుంచి వేగంగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
NDL: జనాభా గణనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం ఉదయం 7:30 గంటలకు నంద్యాలలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీచౌక్ వరకు 5కే రన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో సెన్సస్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్ట్‌లను శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు.
సత్యసాయి: లేపాక్షిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో ఎండ తీవ్రత కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. దేవస్థానం ఈవో ఎం.హెచ్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులు నడిచే ప్రదేశాల్లో మ్యాట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎండలో కాలుతున్న రాళ్లపై నడవడం సులభమైనందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: మచిలీపట్నం మండలం పెద్దకరగ్రహారం, చిన్నకరగ్రహారం గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. 13 బ్లాకుల్లో సుమారు 16 వేల ఇళ్ల పట్టాలు కేటాయించినప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.