ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతులు తమ పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ మేనేజర్ గురుమూర్తి కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, వన్ బి అడంగల్ తీసుకొని రైతులు తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
NLR: ఆత్మకూరు మండలం, కరటంపాడు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటోలో ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్ మరిచి వెళ్లిపోయినట్లు గుర్తించిన ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సై జిలానికి అందించాడు. ఎస్సై జిలాని మాట్లాడుతూ.. ఈ ఫోన్‌కి సంబంధించిన ఆధారాలు చూపించి ఫోన్ తీసుకెళ్లాలని సూచించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను ఎస్సై అభినందించారు.
సత్యసాయి: జిల్లాలోని పుట్టపర్తి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక పుట్టపర్తి డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
KRNL: పెద్దకడబూరులోని లక్ష్మీపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధమయి సర్వం కోల్పోయి వీధిన పడ్డ జెల్లి అంజినయ్య కుటుంబానికి వైసీపీ నేతలు అండగా నిలిచారు. శుక్రవారం వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివరామరెడ్డి, విజయేంద్ర రెడ్డి బాదిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యవసర వస్తువులు, రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
NDL: మహానంది మండలం బుక్కాపురంలో YCP శిలా ఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామంలో రైస్ మిల్లు నుంచి శ్మశానం వరకు సుమారు రూ. 7 లక్షలతో వైసీపీ ప్రభుత్వంలో రహదారిని నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గురువారం రాత్రి దుండగులు ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ గ్రామ నాయకుడు కందుల రఘురామిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలుత తెలియాల్సి ఉంది.
W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీధర్ టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయారు. ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ATP: జిల్లా క్రికెట్ సంఘము ఆధ్వర్యంలో ఈ నెల 18న సీనియర్ మహిళలకు, 19న అండర్-15 బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆర్డిటిలో నిర్వహించే ఎంపిక పోటీలకు హాజరై క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రి, యూనిఫామ్‌తో హాజరు కావాలన్నారు.
E.G: రాజమండ్రిలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి శుక్రవారం విస్తృత చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ డీఎస్పీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించారు.
KDP: ప్రొద్దుటూరులో 1946లో నామ ఎరుకలయ్య ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ గీతాశ్రమం ఆదాయ వివరాలను ఈవో శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. ఆశ్రమానికి 5 కాలేజీల నుంచి రూ.65.41 లక్షలు, షాపులు, ఇళ్ల బాడుగల ద్వారా రూ.29 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని తెలిపారు. 38.96 ఎకరాల భూముల కౌలుతో పాటు రూ.2.01కోట్ల ఎల్డీలపై వడ్డీ వస్తోందని పేర్కొన్నారు.
NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి మాతకు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా పూజలు చేశారు. అర్చకులు తెల్లవారుజామున అమ్మవారిని పసుపు పారాయణంతో సింగారించి, విశేష పుష్పాలంకరణలో కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహరతి పూజలు గావించారు. అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
PPM: ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్.శ్రీనివాసరావు ఆద్వర్యంలో శుక్రవారం కురుపాం మండలం జోంగరపాడు గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు ఫేస్ యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో కొనసాగించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు సమస్యలు తలెత్తి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
KDP: సిద్దవటం మండలం మాధవరం-1 పంచాయతీ పరిధిలోని బంగారుపేట గ్రామ సమీపంలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
KRNL: దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె. దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
కోనసీమ: జిల్లాలో కొబ్బరికాయ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కొబ్బరి కాయ రూ.16 నుంచి రూ.18 వరకు పలుకుతుంది. అయితే ధర బాగానే ఉన్నా పంట దిగుబడి లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరానికి 1000 కొబ్బరికాయ వచ్చే చోట ఇప్పుడు 500 కూడా రావడం లేదని వాపోతున్నారు. దిగుబడి లేకపోవడంతో ఎంత రేటు ఉన్నా ప్రయోజనం లేదంటున్నారు.
సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. 15 నుంచి 19 ఏళ్ల లోపు క్రీడాకారులు SAAP వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనంతో పాటు ఆధునిక శిక్షణ ఇస్తామన్నారు.