వచ్చే ఎన్నికల కోసం ఏపీలో అన్ని పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎలాగైనా పొత్తులు పెట్టుకొని అయినా ఈ సారి పదవిలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేపట్టగా… వైసీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి స్వయంగా సీఎం జగన్ ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తుండటం గమనార్హం.
ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పం మునిసిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు సీఎం హాజరవుతున్నట్లు పార్టీ కీలక నేతలు వెల్లడించారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ హెలికాప్టర్లో కుప్పంకు రానున్న నేపథ్యంలో ఇరు నేతలు హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు.
కుప్పం మునిసిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం సీటును కూడా కైవసం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపైనే పూర్తి దృష్టి సారించారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కాలంలో ఎమ్మెల్యే, మంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ కుప్పం సీటును కూడా వైఎస్సార్సీపీనే గెలవాలంటూ దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో.. మునిసిపాలిటీ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో 22వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన సాగనుంది.