ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు సొంత నియోజకవర్గమన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా… ఈ నియోజకవర్గానికి తొలిసారి బహిరంగ సభలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా జగన్… చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
గతంలో పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూడాలని కోరారు. నాన్ డిబిటి పథకాల ద్వారా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యాకానుక, జగనన్న తోడు కార్యక్రమాలను కూడా కలిపితే రూ.లక్షా 41వేల కోట్లు ఉన్నాయని, డిబిటి, నాన్ డిబిటి పథకాల ద్వారా రూ.3,12,764 కోట్ల రుపాయలను ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చినట్లు చెప్పారు. 2.39లక్షల కోట్ల రుపాయల విలువైన ప్రయోజనాలు మహిళలకు అందాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 31లక్షల మంది మహిళలకు 2-3లక్షల కోట్ల విలువైన ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఇంటి స్థలం, ఇంటి విలువ ఐదారు లక్షలకు తక్కువ ఉండదని చెప్పారు.
చంద్రబాబు చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం అప్పులు తక్కువ చేసినా అప్పుడు లేని సంక్షేమం ఇప్పుడు ఎందుకు అమలవుతుందో చెప్పాలన్నారు. చంద్రబాబు హయంలో అందని సంక్షేమాన్ని ఇప్పుడు ఎలా అందించగలుగుతున్నామో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు ఏమి చేయలేదని సిఎం ఆరోపించారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో 33ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి మాత్రం ఏమి చేయలేదని ఆరోపించారు. కుప్పం నుంచి తీసుకోవడమే తప్ప ఏమి చేయలేదని విమర్శించారు. కుప్పంకు నీరు తీసుకురావాల్సిన హంద్రీనీవా నీటిని తీసుకువచ్చే కాంట్రాక్టులు తన వారికి ఇచ్చుకున్నాడని ఆరోపించారు.
రూరల్ వాటర్ సప్లై పేరుతో దొంగ ట్యాంకర్లు పెట్టి దోచేశారని ఆరోపించారు. ట్రాక్టర్లు లేకుండా నీరు సరఫరా చేసేందుకు ఎప్పుడు ఆలోచించలేదని విమర్శించారు. కుప్పం అభివృద్ధి చెందితే ప్రజలు తన మాట వినరని ఆ ప్రాంతాన్ని బాగు చేయలేదని ఆరోపించారు. కుప్పం నుంచి బెంగళూరు, చెన్నై వలస వెళుతున్నా వారికి ఉద్యోగాలు చూపించే ఆలోచన రాలేదని తప్పు పట్టారు.