శిరీష అలియాస్ బర్రెలక్క ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఎన్నికల బరిలో నిలవడంతో దేశమంతా ఆమె పేరు మారుమోగింది. తాజాగా బర్రెలక్కను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో దాసరి కవిత అలియాస్ జుమ్ చక జుమ్ చక స్టార్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది.
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) సంచలనం సృష్టించిన బర్రెలక్క (Barrelakka)ను చాలా మంది స్ఫూర్తిగా తీసుకున్నారు. రీల్స్ (Reels) చేసుకునే ఓ యువతి తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది. నిరుద్యోగులకు న్యాయం జరగడం కోసం తాను ఎన్నికల బరిలో దిగినట్లు శిరీష (Sirisha) అలియాస్ బర్రెలక్క చాటిచెప్పింది. దీంతో ఆమెకు చాలా మంది మద్ధతు పలికారు. ఆమె తరపున ప్రముఖులు సైతం వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సరిహద్దుతో ప్రమేయం లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బర్రెలక్కకు మద్దతు పలికారు. అయితే తాజాగా ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న చాలా మంది ఏపీలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత (Dasari kavitha) కూడా ఉన్నారు. దాసరి కవిత ఓ యూట్యూబ్ స్టార్ (Youtube Star). ఈమె కూడా జుమ్ చక జుమ్ చక యూట్యూబ్ స్టార్ గా ఫేమస్ అయ్యింది.
త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని దాసరి కవిత చెబుతోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని, అదే తన లక్ష్యమని ఈ జుమ్ చక జుమ్ చక స్టార్ (Jhum Chak Star) ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకోసం ఆమె ఇప్పటికే ఓ పది హామీలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె నెట్టింట షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ (Viral) అవుతోంది.