2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ కూడా కలుస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది.
ఎన్నికలకు సమీపిస్తున్న సమయంలో వైసీపీ పదేపదే జనసేనానిని టార్గెట్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ మొదలు మెగా అభిమానులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ ప్రతిపక్ష ఓటు చీలవద్దనే ఆలోచనతో ఉంటే, జనసేనానిని కూడా కలుపుకొని విజయం సాదిద్దామని చంద్రబాబు, ఏపీలో కాస్త ప్రభావం చూపుదామని అమిత్ షా భావిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్న వైసీపీ మాత్రం నిత్యం పవన్‌ను టార్గెట్ చేస్తోంది. మేం ఒంటరిగా పోటీ చేస్తామని, టీడీపీ, జనసేన మాత్రం తమను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసి వస్తామని చెబుతున్నాయని జనసేనానిని మానసికంగా కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి వైసీపీ వర్గాలు. అయితే నియంతను కొట్టేందుకు బరాబర్.. కలిసే వెళ్తామంటూ కౌంటర్ ఇస్తున్నారు.
పవన్‌ను దెబ్బతీసేందుకు అవసరమైన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాపులు, మెగా అభిమానులు, జనసైన్యాన్ని కూడా వైసీపీ మచ్చిక చేసుకునే విధంగా మాట్లాడుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఎప్పుడు కూడా కులం కార్డును ఉపయోగించలేదు. పైగా, తాను అన్ని కులాలకు, మతాలకు చెందినవాడిగా చెబుతుంటారు. అలాగే, యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్‌కు కొదువలేదు.
ఆయనను వైసీపీ పదేపదే టార్గెట్ చేస్తూ…. పర్సనల్ విషయాలు ఎత్తిచూపడం, ఒంటరిగా పోటీ చేయడం చేతకానివాడంటూ కార్నర్ చేసే ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఎందుకంటే పవన్ వాటిని గట్టిగానే తిప్పి కొడుతున్నారు. అలాగే, తనను తాను కాపుల ప్రతినిధిగా చెప్పుకోనప్పటికీ వైసీపీ అలా చూపించే ప్రయత్నాలు చేస్తూనే, కాపులకు మీరే లీడరా అని తిరిగి ప్రశ్నించడం చూస్తున్నాం. మీరు చిరంజీవి ద్వారా ఎదిగారు కానీ, మీ వల్లే చిరంజీవికి పేరు వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ మెగా అభిమానులనూ తమవైపు తిప్పుకునే విధంగా మాట్లాడుతున్నారు.
ఇవి గమనిస్తుంటే వైసీపీకి పవన్ భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ – జనసేన పొత్తు తమను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని వైసీపీ భావిస్తుండవచ్చునని అంటున్నారు. అందుకే జనసేనానిని అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఏ ఎన్నిక అయినా.. గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఒకవిధంగా 2014లో టీడీపీ గెలుపుకు, 2019లో టీడీపీ ఓటమికి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు వేర్వేరుగా పోటీ చేయడం వల్లే వైసీపీ ఘన విజయం సాధించిందనే లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పొరపాటు చేయవద్దని భావిస్తున్నారు.
2024లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ ఒక్క పార్టీతో కాదని, పవన్ కళ్యాణ్‌ను కలుపుకోవాల్సిందేనని చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు ఉంగుటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీయే నిదర్శనం. ఉంగుటూరు మండల తెలుగు యువత సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవన్, చంద్రబాబుతో కలిసిన శుభాకాంక్షల ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అందులో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పేర్కొనడం అందరినీ ఆకట్టుకుంటోంది.
మొత్తానికి వచ్చే ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కానీ, రాజకీయాల్లో విఫల నాయకుడని ప్రజల ముందు చూపేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. మరి వైసీపీ మైండ్ గేమ్, విమర్శలను ఇప్పటికే తిప్పికొడుతున్న పవన్ మున్ముందు జగన్‌ను ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.