మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారంటూ ఆయన చేసిన కామెంట్స్… తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయాలలో కొత్త ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతనంగా ఉండేవారని తెలిపారు. అందరినీ నమ్మేవారు, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్న సమయంలో ఆరుగురు మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించారన్నారు. దీనిపై ఎన్టీఆర్ను అడిగితే వారికి తనపై ఉన్న ప్రేమ అని అన్నారని గుర్తు చేశారు. దీంతో అది ప్రేమ కాదు, పిండాకూడు కాదు అన్నానని తెలిపారు. ఆ తర్వాత ఆగస్టులో ఎన్టీఆర్కు జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్లో ఆ ఆరుగురు మహిళలే ముందున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని వెంకయ్యనాయుడు కొనియాడారు. పేద వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారని కీర్తించారు. ఆడపడుచులను ఆదరించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని వివరించారు. బలహీన పేద వర్గాలకు చేయూతనిచ్చారన్నారు. ఎన్టీఆర్ తన వెనక జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను గమనించలేకపోయారని వెంకయ్యనాయుడు అన్నారు.
సిద్దాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని చెప్పుకొచ్చారు. ఉచితాలు అనుచితం అని… చేపలు పెట్టడం కాదు పట్టడం నేర్పాలని హితవుపలికారు. సమాజంలో అశాంతి పెరుగుతుందని.. మనుషుల్లో అశాంతి పెరిగిందన్నారు. ఎన్టీఆర్ స్పూర్తిని నేటి తరం కొనసాగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానని… కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.