స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో తీవ్ర ఉక్కపోత వల్ల ఆయన డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బాబు పర్సనల్ వైద్యులను ఆయన వద్దకు పంపి వైద్యం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో రాజకీయాలు మరింత హీటెక్కాయి. టీడీపీ (TDP) నేతలపై అక్రమ కేసులు పెట్టి వారిని జైలు పాలు చేయాలని వైసీపీ (YCP) చూస్తోందని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill developement scam Case)లో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన ఉక్కపోతతో ఇబ్బంది పడటం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలర్జీ కూడా రావడంతో వైద్యులు బాబుకు చికిత్స చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandrababu) ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బాబు ఆరోగ్యంపై సీఎం జగన్కు (CM Jagan) వినతిపత్రం ఇచ్చేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్దకు వెళ్లడానికి యత్నించారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు, టీడీపీ (TDP) నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
చంద్రబాబును రక్షించుకోవడం కోసం సీఎం జగన్ ఇంటికెళ్లి ఆయనకు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్యుల బృందాన్ని పంపాలని ఈ సందర్భంగా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి బాబును తరలించాలని, ఆయన జైలులో ఉండటం వల్ల ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని, ఆయన ఇంకా బరువు తగ్గితే ఆరోగ్యం బాగా క్షీణిస్తుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
బాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడించకుండా ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. చంద్రబాబు సొంత డాక్టర్లను వెంటనే ఆయన వద్దకు పంపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఆస్పత్రుల మీద తమకు నమ్మకం లేదని, చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు.