చిత్తూరు జిల్లా పుంగనూరు(Punganur)లో ఉద్రిక్తత నెలకొంది.ప్రాజెక్టుల నిర్మాణం రాజకీయ వివాదంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి(Minister Peddireddy) సొంత నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో రాజకీయ రగడ రాజుకుంది. సోమల మండలం ఆవులపల్లిలోని సీతమ్మ చెరువు (Sitamma pond) పై నిర్మిస్తున్న ప్రాజెక్టుపై వివాదం నెలకొంది. ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఏడాది క్రితం ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని రైతులు గ్రీన్ ట్రిబ్యునల్(Green Tribunal)ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు(Supreme Court) లో కేసు ఫైల్ అయింది. దీంతో ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది.మరోవైపు ప్రాజెక్టు పనులు యధావిధిగా కొనసాగేలా రైతులతో సంఘీభావ సభను వైసీపీ (YCP) ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. ఈ సభలో ఎంపీ రెడ్డప్ప, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మూడు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, కానీ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపించింది.
పెద్దిరెడ్డికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.మరోవైపు ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా పుంగనూరు వద్ద రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు గ్రామాల బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నఆయన నిర్వాసితులను నేరుగా కలిసి మద్దతుగా నిలిచే అవకాశం లేకపోవడంతో హెలికాప్టర్ లో పర్యటించారు. దీంతో పోలీసులు రామచంద్ర యాదవ్ పై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసేందుకు రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు (Police) చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు, వై ప్లస్ సెక్యురిటీతో వాగ్వివాదానికి దిగారు. రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం అరుదైన Y+ కేటగిరి భద్రత కల్పించింది. చిత్తూరు జిల్లా(Chittoor District),, పుంగనూరుకు చెందిన జనసేన నేత రామచంద్ర యాదవ్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఓర్వలేక అధికార పార్టీ నాయకులు పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా అడ్డుకోవడం జరుగుతోందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో పుంగనూరు జనసేన అభ్యర్థిగా రామచంద్రయాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.