ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటివల పుంగనూరులో దళితనేతపై పోలీసులు చిత్రహింసలు చేయడంపై మండిపడ్డారు. అంతేకాదు మంత్రి పెద్ది రెడ్డి పాలనలో ఈ అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.
nara lokesh comments on peddireddy rule in punganur chittoor
ఏపీలోని పుంగనూరులో దళిత నేతపై చిత్రహింసలు చేయడం దారుణమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(nara lokesh) అన్నారు. ఏపీలో పోలీసులు అధికార వైసీపీ పార్టీకి ప్రైవేటు సైన్యం మాదిరిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యహింసను ఆపడంలో పోలీసులు ఆపకపోగా..మరింత పెంచుతున్నారని అన్నారు. దీంతోపాటు ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తీవ్రమైన దాడులకు పోలీసులే పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరచాక పాలన దారుణంగా ఉందన్నారు. టీడీపీకి చెందిన ఓ దళిత నేత, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంటకరమణను కల్లూరు సీఐ శ్రీనివాసులు అక్రమంగా నిర్భందించారని నారా లోకేష్ ఆరోపించారు. అంతేకాదు అతని నోట్లో గుడ్డలు కుక్కి చిత్ర హింసలు చేయడం ఏపీలో తాలిబన్ రాజ్యాన్ని తలపిస్తుందన్నారు. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం వేదికలపై నా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని లేని ప్రేమలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత నేతలపై దాడులు జరుగుతున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ వెంటనే స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
అంతకుముందు పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగులకు సరైన ఆశ్రయం కల్పించడంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో కమ్యూనిటీ ఆస్పత్రిలో చెట్ల నీడన రోగులు చికిత్స పొందుతున్నారని అన్నారు. నల్లమల అడవుల్లోని గిరిజన వర్గాల కోసం ఇది ఏకైక ఆరోగ్య సంరక్షణ సౌకర్యమని ఎద్దేవా చేశారు. అంతేకాదు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ సొంత జిల్లాలోనే విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి రోగులకు సరైన వసతి లేకుండా ఉండడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్యం ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు.