Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూర్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి. రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టగా.. అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
పుంగనూరులో చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్ లారీ, వాహనాలను పోలీసులే అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్ వెంట వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.
వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. రాళ్లదాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలం అయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలని పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.
”టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. డీఎస్పీ యూనిఫామ్ తీసేయాలి. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా? ధైర్యం ఉంటే రండి చూసుకుందాం. పులివెందులకే వెళ్లాను ఇక్కడికి రాకూడదా? నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టా. పోలీసుల అండతోనే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఎవరి జోలికీ మేము వెళ్లం.. మా జోలికి వస్తే ఊరుకోం. పుంగనూరు వెళ్తున్నా.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తా. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు. అతనికి ట్యాగ్ ఎమ్మెల్యే. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఇక్కడ జరిగిన ఘటనలో పోలీసుల వైఫ్యలం ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి. రాబోయే రోజుల్లో వైసీపీని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారు” అని చంద్రబాబు మండిపడ్డారు.