తెలుగుదేశం-జనసేన పొత్తు ఆ పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వైసీపీకి 151 సీట్లతో ప్రజలు గెలిపిస్తే, అన్నింటా ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. జగన్ పాలనపై ఓ రకమైన అసంతృప్తి ఉంటే, దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్న నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వైపు తెలుగుదేశం, మరోవైపు జనసేనల నుండి పోటీ చేసే అభ్యర్థులు తమ గెలుపుపై కాస్త ధీమాగా ఉంటారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు అనడంతో ఎవరి సీటుకు ఎసరుపడుతుందనే చర్చ అప్పుడే రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇప్పటికే ఒక్కో పార్టీలో ఒకరికి మించి ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు పార్టీలు కలిస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడిపోవడం, చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తితో వైసీపీ దాదాపు మొత్తం స్థానాలు గెలుచుకున్నది. కానీ ఈసారి జగన్ ప్రభుత్వంపై అంతకంటే ఆగ్రహంతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి కేడర్, గతంలో పలుమార్లు గెలిచిన పరిస్థితి ఉంది. అలాగే, కాపు సామాజిక వర్గం, యువత ఎక్కువగా ఉన్నచోట జనసేనకు మంచి పట్టు ఉంటుంది. వైసీపీ ఫెయిల్ అని భావించే చోట్ల ఇరుపార్టీల అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బలం కూడా సమానంగా ఉండే పరిస్థితి ఉంటే, టిక్కెట్ ఎలా ఇస్తారు, ఏ పార్టీకి అవకాశం వస్తుందనే ఆందోళన ఆశావహుల్లో కనిపిస్తోంది.
టీడీపీ, జనసేనలు పోటీ చేసే ఆయా చోట్ల అసంతృప్తులు కనుక రంగంలోకి దిగితే అది వైసీపీకి ప్లస్ అవుతుంది. అప్పుడు 2019 రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవిధంగా చెప్పాలంటే కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా టీడీపీ, జనసేనలకు ఉన్న ఓటు బ్యాంకు మెజార్టీ ఒకటే అంటున్నారు. వైసీపీకి విడిగా భారీ ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ జనసేనకు ముందు టీడీపీ వైపు ఉన్న ఓటర్లలో ఇప్పుడు చాలామంది జనసేన వైపు మరలినట్లుగా చెబుతున్నారు. 2004లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, 2009లో టీడీపీ గెలుస్తుందని భావించారు. కానీ అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం గండి కొట్టిందని చెబుతారు. అంటే చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ వల్ల మెజార్టీ ఓటు బ్యాంకు కోల్పోతుంది తెలుగుదేశం పార్టీయే అనే వాదనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అసంతృప్తులు రంగంలోకి దిగితే కనుక సొంత ఓటు బ్యాంకు చీలిస్తే, అది వైసీపికి ప్లస్ అవుతుంది.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూడా పెద్ద చిక్కు. టీడీపీ మెజార్టీ సీట్లలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు అలాంటి ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ, ఆ పార్టీలోని వారు మాత్రం మెజార్టీ సీట్ల కోసం జనసేనానిపై కచ్చితంగా ఒత్తిడి తెచ్చే అవకాశముంటుంది. సగం సగం సీట్లకు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తి ఉండదు. పదేళ్లలో తాము బలపడ్డామని, తమతో పొత్తు కారణంగానే గెలుస్తున్నారని చెబుతూ జనసేన కూడా మెజార్టీ సీట్లు అడిగే అవకాశముంటుంది. ఈ నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని అనేది ఓ సమస్య అయితే, ఏయే చోట ఎవరు పోటీ చేయాలనేది మరో పెద్ద సమస్య.
టీడీపీ-జనసేన పొత్తుతో తాము గెలుస్తామని భావిస్తున్న వైసీపీకి ఇది మింగుడు పడటం లేదని తెలుగుదేశం, జనసేన నేతలు అంటున్నారు. కానీ ఈ పొత్తు వైసీపీ కంటే తమకే ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుందనే అంశం అగ్రనేతలు ఇప్పటికిప్పుడు మాట్లాడకపోయినప్పటికీ, ఆశావహులు, కిందిస్థాయి క్యాడర్ మాత్రం గుసగుసలాడుకుంటోందట.
ఏదేమైనా టీడీపీ-జనసేన పొత్తు 2014లో వలె ఆ కూటమిని గట్టెక్కిస్తుందా? లేక విడిగా పోటీ చేసిన 2019 వలె చేదును మిగులుస్తుందా? వచ్చే ఎన్నికల తర్వాత మాత్రమే తేలిపోనుంది.