సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. ఎన్నికలు దగ్గరపడిన చివరి మూడు నెలల్లో అంతా మారిపోతుందని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎన్నికలకు చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఖరారు అవుతారు. సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదని నాని అన్నారు. తన గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం మారాలంటే సీనియర్లంతా త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. నేనే సామంతరాజుననే ఇగో, పొగరుని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జగన్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్యాగాలు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. తాను రెండుసార్లు ఎంపీగా గెలిచానని.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. తనకు ఎంపీగా ప్రజలు అవకాశం ఇచ్చారని.. వారి కోసం పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారాయన. ప్రజలకు, యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎవరు చేపట్టినా వెళ్తాను. ఇలాంటి కార్యక్రమం వైసీపీ పెట్టినా వెళ్తా అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.