ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి తగినంత గుర్తుంపు సంపాదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ నేత సోము వీర్రాజు.. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా వేదికను నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. బీజేపీ భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా ఒక ప్రత్యేక సాధనమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న సంక్షేమం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని, త్వరలో రాష్ట్రంలో వందేభారత్ రైలును పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంటోందని, దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్రస్ధాయిల్లో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా చర్యలు ప్రారంభించినట్లు బీజేపీ సాంకేతిక విభాగం నాయకులు చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం ప్రతినిధులు, జిల్లా కార్యవర్గానికి సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్ శివ మకుటం అధ్యక్షత వహించారు.