వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ – తమ పార్టీ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. తాను ప్రతి రోజు వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల అదే పార్టీకి చెందిన మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము జనసేనతో కలిసి ఉన్నామని, కానీ కలిసి ఉన్నా లేనట్లుగానే భావిస్తున్నామని, రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు అని నమ్మకం వస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకున్నదని, దానిని ఖండించాలని తాము చెప్పగా జనసేన ఆ పని చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావడం లేదనేది తమ ఆరోపణ అన్నారు. అదే సమయంలో తాము వైసీపీతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, ఆ పార్టీ వేసిన ఈ అపవాదును తాము తుడుచుకునే ప్రయత్నం చేస్తామన్నారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని, తాము మాత్రం పార్టీ బలోపేతం కోసం పని చేస్తామన్నారు.
వైసీపీతో కలిసి ఉన్నారని ప్రజలు నమ్మారనే మాధవ్ వ్యాఖ్యలపై వీర్రాజు స్పందించారు. వైసీపీ – బీజేపీ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమే అన్నారు. తాను ప్రతి రోజు వైసీపీని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పోరాటాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీతో విశాఖలో జరిపిన బేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వం పైన త్వరలో ఛార్జీషీట్ వేస్తామన్నారు.
జనసేన నుండి సహకారం లేదు
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుండి తగిన సహకారం లభించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోవాలన్నారు. ప్రధాని మోడీని పొగుడుతారు.. కానీ రాష్ట్రంలో బీజేపీ ఎదగనివ్వడం లేదు అన్నారు. మోడీ కేంద్రంలో బాగుంటారు… కానీ ఇక్కడ వద్దా అన్నారు. తాను పలానా నాయకుడు అని పేరు చెప్పను అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను అన్నారు. బీజేపీ-జనసేన విడిపోవాలనేది కొంతమంది కోరిక అన్నారు. రెండు పార్టీల మధ్య బంధం తెంపేయాలనేది మీ కోరిక అన్నారు. ఓ చిన్న మాట పట్టుకొని, ఏదేదో ఊహించేస్తున్నారని, డిబేట్స్ అన్ని చూస్తున్నానని, మేం విడిపోవాలనే మీ కోరిక ఫలించదన్నారు.