Nara Lokesh: స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) మకాం వేశారు. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. వీలు చూసుకొని రాజకీయ నేతలను కలుస్తున్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ రోజు కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరామని లోకేశ్ వివరించారు. ప్రతిపక్ష నేతను అణచివేసే చర్యలను అధికార వైసీపీ చేపట్టిందని తెలిపారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తంతు అని.. ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వివరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని వివరించారు. తమ వద్ద ఉన్న ఆధారాలను రాష్ట్రపతికి అందజేశామని తెలిపారు. సీఎంగా జగన్ చేసిన పనులు అన్నింటికీ తప్పకుండా రిటర్న్ గిప్ట్ అందజేస్తామని నారా లోకేశ్ స్పష్టంచేశారు.
యువగళం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన వెంటనే.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పేరును చేర్చారని లోకేశ్ వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు ఏం సంబంధం అని అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేకున్నా కేసు ఎలా పెట్టారని అడిగారు. దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.