Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నిరసనలు జరిగాయి. కొందరు వినూత్నంగా నిరసన చేస్తుంటారు. అయితే తాజగా ఓ పెళ్లి జంట వినూత్న నిరసన ప్రదర్శించింది. పెళ్లిపీటలపై కూర్చుని ప్లకార్డులతో వధూవరులు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలోని పర్చూరు మండంలోని కొల్లావారిపాలాంలో జరిగింది. ఈ గ్రామంలో ఉండే త్రినాథ్‌కు గుంటూరులో ఉండే భానుతో వివాహం జరిగింది. వధూవరులు జీలకర్ర, బెల్లం పెట్టకునే సమయంలో ‘చంద్రబాబుకు తోడుగా నియంతపై పోరాటం కోసం మేము సైతం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుపై తప్పుడు కేసి పెట్టి అతనిని జైలులో పెట్టడం అన్యాయమని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నినాదాలు చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో స్కిల్ డెవలప్మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.3,356 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో రూ.371 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తర్వాత జగన్ ప్రభుత్వం 2020లో విచారణకు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీ విచారించగా.. తర్వాత సీఐడీకి బదిలీ అయ్యింది. ఈ అవినీతి కేసు విషయంలో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడని సీఐడీ తెలిపింది. 37 సెక్షన్లు కింద కేసు నమోదు చేసి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.