రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి, సంతోషకరమైన వాతావరణం, అరాచకాలు అంతం కావాలంటే అధికార వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) పిలుపునిచ్చారు. తన రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా అమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సందర్భంగా పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గురువారం నాడు పవన్ కళ్యాణ్ ‘హలో ఏపీ-బై బై వైఎస్ఆర్ కాంగ్రెస్’ అనే ఎన్నికల నినాదాన్ని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. వీటిని అందరికీ అందుబాటులోకి తెస్తానని ఆయన ప్రకటించారు. కోనసీమ ప్రాంతానికి రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమల ప్రారంభించడానికి సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక యూనిట్లలో స్థానిక యువతకు 70 శాతం రిజర్వేషన్లు వంటి అనేక హామీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి మరిచారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. కోనసీమ ప్రాంతానికి చెందిన గ్యాస్ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు(jobs) కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నుంచి తమ వాటాలో రెండు శాతం స్థానిక అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల కల్పన, 50 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పోలీసు శాఖలో 6,500 పోస్టుల కల్పన వంటి హామీలను వైఎస్ఆర్సి(YSRCP) ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమస్యలపై సీఎంను ఎందుకు ప్రశ్నించడం లేదని యువతను నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ యువతకు హామీ ఇచ్చారు. కాకినాడ గంజాయికి గేట్వేగా మారిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా యువత వీటి వినియోగానికి బానిసలవుతున్నారని గుర్తు చేశారు. ఏపీ(AP) గంజాయి హబ్‌గా ఎలా మారుతుందో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పానని పవన్ కల్యాణ్ అన్నారు.