pawan kalyan comments on ap cm post at mangalagiri
Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను లక్ష ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. పవన్ పిఠాపురం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నానన్న విషయమై కారణాలను వివరించారు.
చాలా మంది తనను పిఠాపురం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారని అన్నారు. అందుకనే తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానన్నారు. ఇక నుంచి ఈ నియోజకవర్గాన్ని తన స్వస్థలం అనుకుంటానన్నారు. ఒక ఎమ్మెల్యే తలచుకుంటే అభివృద్ధి ఎలా చేయొచ్చో చేసి చూపిస్తానని అన్నారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తాను సమాజాన్ని కలిపే వ్యక్తినిగాని, విడదీసే వ్యక్తిని కాదన్నారు. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాపై ఓటు వేయొద్దని తెలిపారు.
ఈ సందర్భంగా జనసేనలో(Jana Sena) చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన వంగా గీత ఇప్పుడు వైసీపీని విడిచి జనసేనలోకి రావాలని సూచించారు. జనసేన పార్టీకి రెండు పార్లమెంటు సీట్లు 21 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు కేటాయింపు జరిగిన విషయం తెలిసిందే.