Temperature : అత్యంత వేడిగల సంవత్సరంగా 2023 రికార్డు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. అలాగే అత్యంత వేడైన దశాబ్దంగానూ నిలిచింది. ఈ విషయం మానవాళికి రెడ్ అలర్ట్ లాంటిదే.
2023 Record Highest Global Temperature : మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల భూ వాతావరణం అంతకంతకూ వేడిగా మారుతోంది. 2023 సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా చరిత్రలో నిలిచింది. అలాగే 2014 నుంచి 2023 వరకు ఉన్న దశాబ్ద కాలాన్ని అత్యంత వేడి దశాబ్దంగా ఐక్య రాజ్య సమితి వెల్లడించింది. ఈ దశాబ్ద కాలంలో సముద్రాల్లో నీరు వేడెక్కిపోవడం, హిమానీ నదాలు కరగడం, అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం లాంటివి రికార్డు స్థాయిలో నమోదయ్యాయని ఐరాస వాతావరణ విభాగం వార్షిక నివేదికలో పేర్కొంది.
ఈ విషయమై ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుడెర్రస్ మాట్లాడారు. ప్రపంచం ప్రమాదం అంచున ఉందని తెలియజెప్పడానికి ఇలా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలే నిదర్శనం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచానికి ఒక రెడ్ అలర్ట్ అని పేర్కొన్నారు. ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తే సముద్ర పర్యావరణ వ్యవస్థ, కోరల్ రీఫ్ల సమతౌల్యత దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
భూమి మీద క్రమంగా మంచు ఫలకాలు తగ్గి నీరుగా మారుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఐరాస తెలిపింది. గడచిన దశాబ్దంలోనే సముద్ర మట్టాలు రెట్టింపు అయ్యయని వెల్లడించింది. ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలని తెలిపింది. 1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ప్రముఖ హిమానీ నదాలు తమ మంచును చాలా కోల్పోతూ వస్తున్నాయి. స్విట్జర్లాండ్లోని ఆల్ఫైన్ హిమానీ నదాలు గడచిన రెండేళ్లలోనే ఏకంగా 10 శాతం కోల్పోయాయని ఐరాస చెబుతోంది. ఇలాంటి వాతావరణ మార్పుల వల్ల కరువులు, వరదలు లాంటి ప్రకృతి వైపరిత్యాలు మున్ముందు తప్పవని పేర్కొంది.