World Happiness Report: ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల లిస్ట్‌ను యూస్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఏడుసార్లు ఇలా మొదటి స్థానంలో కొనసాగుతుండడం విశేషం. అయితే ఈ రోజు అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కావడంతో ఓ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143 దేశాలకు పైగా ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1, డెన్మార్క్(2), ఐస్లాండ్(3) వరుసగా మొదటి మూడు స్థానాలను సంపాదించుకున్నాయి. అయితే ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. చైనా(60), నేపాల్(95), పాకిస్థాన్(108), మయన్మార్(118) దేశాలు మనకన్న మెరుగైన స్థానంలో ఉన్నాయి.
ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉండటానికి ముఖ్య కారణం వాళ్లు ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకులు జెన్నిఫర్ డీ పావోలా తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడిపెడతారని.. ఫిన్లాండ్లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు.