Pavan Kalyan: దుష్టపాలన ఇంకా కొన్ని నెలలు మాత్రమే!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన పొత్తు తప్పనిసరని అన్నారు.
Pavan Kalyan: విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ వైసీపీని గెలిపించారనుకోండి.. మీ భవిష్యత్‌ను మీరే నాశనం చేసుకున్నట్లే. వైసీపీ దుష్టపాలన ఇంకా మూడు నెలలే. ఇక మేం టీడీపీ వెనకాల నడవడం లేదు. టీడీపీతో కలిసి నడుస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన పొత్తు తప్పనిసరి. విశాఖ నాకు ఎంతో ధైర్యాన్నిచ్చి.. పార్టీని ముందుకు తీసుకెళ్లే స్థాయికి తీసుకొచ్చింది. ఈ ధైర్యమే టీడీపీ-జనసేన కూటమిని నిలబెడుతుందని అన్నారు. రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన మీ ముందు ఉంటున్నా అంటే మీ భవిష్యత్ కోసం మాత్రమే. ఓటమి ఎలా ఉంటుందో యువతకు బాగా తెలుసు.
ఏపీ భవిష్యత్ బాగుండాలనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాం. మళ్లీ అయిదేళ్లు యువత భవిష్యత్‌ను తాకట్టు పెట్టలేను. అవసరమైతే నన్ను నేను తగ్గించుకుంటానని పేర్కొన్నారు. మనం పోటీ చేసే స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మీ గుండెల్లో ఉన్న అభిమానం ఓట్లలో చూపించకపోతే ప్రయోజం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడుల్లో రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే కాళ్లు, చేతులు తీసేసే బలం మనకు కలగాలి. మమ్మల్ని గెలిపిస్తే పోలీస్ శాఖకు పూర్వ వైభవం తెస్తాం. నా సినిమాలు ఆపేందుకు పోలీసులకు థియేటర్ల వద్ద కాపాలా కాశారు. కానీ అలాంటి చిల్లర పనులకు వారిని మేం వాడుకోమని పవన్ కల్యాణ్ అన్నారు. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారుమయం చేయాలనేది నా లక్ష్యమని తెలిపారు.