Third Degree on Pattabhi: ముసుగు ధరించి చితకబాదారు
గన్నవరంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి, తదనంతర పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు పట్టాభి.
గన్నవరంలో (Gannavaram) తెలుగు దేశం పార్టీ (Telugudesam) కార్యాలయంపై దాడి, తదనంతర పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై (Pattabhi) దాడి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు పట్టాభి. ముసుగులు ధరించిన వ్యక్తులు.. తన ముఖానికి టవల్ చుట్టి, అరగంటపాటు తీవ్రంగా కొట్టారని కోర్టుకు తెలిపారు. అరచేతి పైన, అరికాళ్ల పైన వాచిపోయేలా కొట్టినట్లు తెలిపారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేశారన్నారు. తనను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత 200 కిలో మీటర్ల వాహనంలో తిప్పి, చివరకు తోటవల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. అప్పుడు అక్కడ పూర్తిగా చీకటిగా ఉందని, సిబ్బంది కూడా లేరని, ఆ సమయంలో ముగ్గురు ముసుగులు ధరించిన వారు వచ్చి తనను లాక్కెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టారన్నారు. పట్టాభిని అరెస్ట్ చేసిన దాదాపు ఇరవై గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం సాయంత్రం అతనిని అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆ తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి, సాయంత్రం ఆరు గంటల సమయంలో గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.
గన్నవరంలో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించేందుకు, అలాగే నిరసన తెలిపేందుకు అక్కడకు వెళ్లారు పట్టాభి. అయితే పోలీసులు ఆయనను అడ్డుకొని, హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. పట్టాభి సహా పదకొండు మంది గన్నవరం సీఐ కనకారావును హత్య చేసేందుకు ప్రయత్నించారని, కులం పేరుతో దూషించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వారికి జ్యూడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. అయితే తనను కొట్టారని పట్టాభి వాంగ్మూలం ఇవ్వడంతో విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి, ఆ తర్వాత తన ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. పట్టాభి సహా అందరికీ మార్చి 7వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పట్టాభిని పరీక్షల కోసం హాస్పిటల్కు, మిగతా నిందితులను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
కోర్టుకు హాజరయ్యే సమయంలో పట్టాభి తనను చూసేందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు వాచిన చేతితో అభివాదం చేశారు. ఆయన చేయి బాగా వాచిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. అరగంట సేపు కొట్టారని, ఆయన శరీరం నిండా పోలీస్ మార్కు దెబ్బలు ఉండి ఉంటాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారనే విషయం తెలుసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత కోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మోహరించాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల నడుమ స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పట్టాభి భార్య చందన ఆయనను కలిశారు.