NLR: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారె తీసుకుని వెళ్లి తిరుపతి పద్మావతి అమ్మ వారికి సమర్పించిన కార్యక్రమంలో తాను పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. పంచమి తీర్థం సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజైనా మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.
VZM: విజయనగరం జోనల్ స్థాయిలో నారాయణ విద్యాసంస్థలు “మాస్టర్ ఒరేటర్” పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో బొబ్బిలిలో 6వ తరగతి చదువుతున్న కోటగిరి శ్రీశ్రవణ్ జిల్లాలో రెండవ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బేబీనాయన ఈరోజు విద్యార్థిని అభినందించారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు రోడ్ లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. మంత్రి స్థానిక రైతులతో మాట్లాడి, తుపాను ప్రభావం, సీసీఐ నిబంధనలు, పంట కొనుగోలు సమస్యలు గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పండిన పత్తి 5.4 లక్షల హెక్టార్లలో పండిందని తెలిపారు.
NLR: ప్రేమిస్తున్నానని ఓ అమ్మాయి వెంట పడడంతో.. ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు సదరు యువకుడికి దేహశుద్ధి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రోహిత్‌పై దాడి చేసిన వెంకటేశ్వర పురానికి చెందిన కరిముల్లా, హుమేరా, ఆసిఫ్, మహబూబ్, ఖదీర్, అల్తాఫ్‌ను నవాబుపేట పోలీసు అరెస్ట్ చేశారు.
ATP: యాడికి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాలను నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. పంటల సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. పంటలకు రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు.
KRNL: కర్నూలు మండల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి. రామకృష్ణ తాగునీరు, రోడ్లు–డ్రైనేజీ, శ్మశాన భూములు, గృహ స్థలాలు, రైతులకు సాగునీరు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 సాయం అలాగే రైతుల భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
E.G: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ అవకాశాన్ని నిరుద్యోగ యువత తప్పక వినియోగించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి మంగళవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఉచిత శిక్షణ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనసింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణాలను పలువురు తెలియజేయగా.. అధికారులు వాటికి వివరణ ఇచ్చారు. అందరి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
NDL: ఈ నెల 27న ఉదయం 10 గంటలకు వివిధ కేసులలో సీజ్ అయిన వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. వేలం పాటలో పాల్గొనే ఔత్సాహికులు ప్రభుత్వ నిబంధనల మేరకు ధరావతు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చు అని పేర్కొన్నారు. వివిధ కేసులలో సీజ్ అయిన 7 వాహనాలకు బహిరంగ వేలం ఉంటుందన్నారు.
SKLM: రోడ్డుపై ఉన్న షాపులు తొలగించాలని పలాస ఎయిర్ పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ రహదారి పై ఉన్న బడ్డీలు, షాపులను ఆయన దగ్గరుండి జేసీబితో తొలగించే చర్యలు చేపట్టారు. తొలగించని బడ్డీలు తక్షణమే తొలగించాలని ఆయా షాపుల యజమానులకు తెలియజేశారు.
అన్నమయ్య: రైల్వే కోడూరులో జరిగిన ఉచిత కంటి శిబిరంలో శస్త్రచికిత్స అవసరమైన 150 మందిని ముక్కా ఫౌండేషన్ తిరుపతి అరవిందా ఐ హాస్పిటల్స్‌కు తరలించింది. వైద్యులు విజయవంతంగా ఆపరేషన్‌లు పూర్తి చేశారు. రోగుల భద్రత కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కోడూరుకు సురక్షితంగా తీసుకువచ్చారు. ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి రోగులను పరామర్శించి భోజన వసతి కల్పించారు.
W.G: వచ్చే ఐదేళ్లలో అన్నదాతను రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం మండలంలోని రామన్నపాలెం, కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లో నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
PPM: సాహితీ వేత్తలకు పుట్టినిల్లు మన్యం జిల్లా అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఉండటం గర్వ కారణమన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తక మహోత్సవాన్ని పార్వతీపురం GJ కాలేజీ గ్రౌండ్‌లో ప్రారంభించారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడంతో మార్కాపురంలో సంబరాలు మొదలయ్యాయి. మార్కాపురం పట్టణంలోని రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాలవాంఛ అయిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కల సాకారం కావడం ఆనందంగా ఉందని రీడింగ్ రూమ్ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
W.G: నరసాపురం మండలంలోని యర్రంశెట్టిపాలెంకు చెందిన శతాధిక వృద్ధురాలు అయిశెట్టి అన్నపూర్ణ (115) మంగళవారం కన్నుమూశారు. తుదిశ్వాస విడిచే వరకూ తన పనులు తానే చేసుకుంటూ ఆమె చురుగ్గా ఉండేవారు. అన్నపూర్ణకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమె మృతి పట్ల సర్పంచ్ యర్రంశెట్టి నాగముత్యమాంబ సంతాపం వ్యక్తం చేశారు.