PLD: చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆదివారం పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశం జరుగుతుందని ఛైర్మన్ రఫాని ఆదివారం తెలిపారు. సమావేశంలో 2024-25 సంవత్సరపు సవరణ బడ్జెట్ అంచనాలు, 2025-26 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి 26అంశాల ఎజెండాను సమావేశంలో చర్చించనున్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పించిన వసతి, భోజనం మరియు ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
SKLM: బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన బలగ స్వామి నాయుడు విజయవాడలో ఆదివారం జరిగిన 35వ జాతీయ సౌత్ జోన్ 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో 3వ స్థానంలో నిలిచాడు. బ్రాంజ్ మెడల్‌ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో డొంకలపర్త గ్రామ యువత పెద్దలు స్వామినాయుడును అభినందించారు.
PPM: గిరిజన గురుకుల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వివరించారు.
KRNL: నందవరం మండల కేంద్రంలో ఆదివారం గ్రామ హిందువులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. నందవరంలో శనివారం క్రైస్తవులు ప్రచారం చేస్తుండగా కొంతమంది హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది క్రైస్తవులు రాత్రి అభ్యంతరం వ్యక్తం చేసిన హిందువుల ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
BPT: బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఈకో హౌస్ నందు ఆదివారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మహిళలకు ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. స్త్రీల ప్రత్యేకమైన సమస్యలతోపాటు, అధిక బరువు, మెటబాలిక్ జబ్బులు, షుగర్, రక్తపోటు వంటి వ్యాధులకు పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేశారు. ఏరియా వైద్యశాల వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.
VZM: నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామ సమస్యలు పరిష్కరించాలని కూటమి నాయకులు పతివాడ అప్పారావు, మొయిద లక్ష్మణరావు కోరారు. భోగాపురం మండలం ముంజేరులో జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం మాధవిని కలిసి గ్రామ సమస్యలను వివరించారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉన్నత పాఠశాలకు క్రీడాస్థలం కేటాయించాలని కోరారు.
సత్యసాయి: లేపాక్షి మండలంలోని బీసీ వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి ఎస్ఎఫ్ఐ జండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామన్నారు. 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ ఆశయాలపై చర్చించారు. కార్పొరేట్ విద్యా విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పటిష్ఠ పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
W.G: రాష్ట్రవ్యాప్తంగా పేదల లక్ష ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహణలో భాగంగా జనవరి 3న కొవ్వూరుకి సీఎం చంద్రబాబు రానున్నారు. దీంతో ఆయన పర్యటన కారణంగా కొవ్వూరులోని స్పెక్ లేఅవుట్ వద్ద హెలిప్యాడ్, సభ వేదిక ప్రాంతాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్టీవో రాణి సుస్మిత, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో నేరాల నియంత్రణలో భాగంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఏపీ ఆదర్శ పాఠశాల, అక్కివరం, జొన్నాడ, మోదవలస, ఐనాడ జంక్షన్‌లో ఎస్సై ఏ.సన్యాసినాయుడు, సిబ్బందితో ఆదివారం సంకల్ప ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో గొలుసు దుకాణాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదని సూచించారు.
VZM: విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా.. ఆదివారం అన్నవితరణ కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి తెలిపారు. ప్రతీ నెలలో వచ్చే మాస శివరాత్రికి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
CTR: ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నేలవల విజయశ్రీ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లు జనవరి 10, 11, 12 తేదీల్లో కాకుండా 17 ,18 ,19 తేదీల్లో జరపాలని నిర్ణయించామన్నారు. అయితే అవి పండుగ రోజులు కావడంతో వాటిని రద్దుచేసి త్వరలో ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ తేదీలను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
KKD: స్కూల్ పిల్లలను తీసుకుని వెళ్ళే ఆటోలో పరిమితికి మించి ఎక్కించ కూడదని జగ్గంపేట సీఐ శ్రీనివాస్ ఆటో స్టాండ్ సభ్యులకు సూచించారు. జగ్గంపేట సెంటర్ కాట్రావులపల్లి ఆటో యూనియన్ సభ్యుల సమావేశానికి సీఐ హాజరై 110 మంది ఓనర్ కమ్ డ్రైవర్‌లకు పోలీస్ నెంబర్ స్టిక్కర్స్‌ను అందించారు. ఈ సంధర్భంగా సీఐ వారికి రోడ్డు ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని పోలేరమ్మ దేవాలయ ఆలయ కమిటీ అధ్యక్షుడు దొడ్డప్ప ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీవో రాజబాబు, జెవివి రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. గుత్తికి చెందిన రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు రక్తదాత షేక్షావలిని శాలువాతో సత్కరించి సన్మానించారు.
VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా నెల్లిమర్ల పోలీసు స్టేషను విజయనగరం ఎస్డీపీవో ఎం.శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. శాంతి పరిరక్షణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలపాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయిని ముకుతాడు వేయాలన్నారు. స్టేషనులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి బహుమతి ప్రదానం చేసారు.