కృష్ణా: ‘మొంథా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజు జిల్లాలోని అన్ని సినిమా హాల్స్‌ను మూసి వేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి సినిమా ప్రదర్శనలు వేయకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
NDL: చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన డాన్స్ పోటీలలో బనగానపల్లెకు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ గ్రూపుకు మొదటి బహుమతి వచ్చింది. ఈ పోటీలలో తెలుగు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు 70 టీంలు పాల్గొన్నాయి. పోటీలలో నంద్యాల జిల్లా నుంచి బనగానపల్లె కు చెందిన అనిల్ మాస్టర్ టీం పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు.
AKP: నర్సీపట్నంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కూరగాయల మార్కెట్ బోసిపోయింది. ప్రతి మంగళవారం, లక్ష్మివారం, శనివారం జరిగే వారపు సంతలు సాధారణ రోజుల్లో రద్దీగా ఉంటాయి. అయితే ఈరోజు మాత్రం రైతులు కొనుగోలుదారుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కాయగూరలు కొనుగోలు చేయడానికి ప్రజలు బయటికి రాలేదు.
అన్నమయ్య: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో, చిట్వేల్ మండలంలోని ZPHS స్కూల్లో సోమవారం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని HM బి. దుర్గరాజు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ఆయన సూచించారు.
W.G: ముంచుకు వస్తున్న తుఫానుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ‘మొంథా’ తుపాను నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామ పునరావాస కేంద్రంను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సోమవారం పర్యవేక్షించారు. నీరు, భోజన వసతులను సిద్ధం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.
ASR: మొంథా తుఫాను నేపథ్యంలో ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు. జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, ప్రస్తుతం 2,747.95 అడుగులకు చేరింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మంగళవారం నుంచి జలాశయం మూడు గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటినిడుమకు విడుదల చేస్తున్నారు.
KDP: తుఫాను ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదిదిసింగ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం ఆమె టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
KRNL: మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సిరి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల కోసం సిబ్బంది, సామగ్రి సిద్ధంగా ఉంచాలని, ప్రమాదకర వంతెనల వద్ద సిబ్బందిని నియమించి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ప్రకాశం: మొంథా తుఫాన్ నేపథ్యంలో పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ను తహసీల్దార్ వాసు మంగళవారం ఉదయం పరిశీలించారు. తుఫాన్ కారణంగా రిజర్వాయర్‌కు భారీగా వర్షపు నీరు వచ్చి వేరే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రిజర్వాయర్ గేట్లు, కట్టకు ఎటువంటి డ్యామేజ్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
TPT: తిరుపతి కలెక్టరేట్ 0877-2236007 తిరుపతి RDO ఆఫీసు 7032157040, శ్రీకాళహస్తి RDO ఆఫీసు 8555003504, గూడూరు RDO ఆఫీసు 08624-252807,సూళ్లూరుపేట RDO ఆఫీసు 08623295345, రాష్ట్ర టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101. జిల్లా యాంత్రాంగం తుఫాన్ ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు.
ATP: గుత్తి విశ్రాంత కోర్టు ఉద్యోగి షేక్ అహ్మద్ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోర్టు సిబ్బంది, న్యాయవాదులు షేక్ అహ్మద్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ASR: అనంతగిరి మండలంలోని కోనాపురం పంచాయతీ పరిధి వంట్లమామిడికి తుఫాన్ ప్రభావంతో కొండ చరియలు విరిగి పడతాయని గిరిజనులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాహశీల్దార్ సత్యనారాయణ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది వంట్లమామిడి గిరిజనులను పంచాయతీ పరిధి చప్పడిలో ఉన్న సురక్షిత పాఠశాల భవనానికి తరలించారు. వారికి ఆహారం, బియ్యం, నిత్యవసర సరుకులు అందజేస్తామన్నారు.
W.G: ‘మొంథా’ తుఫాను నేపథ్యంలో తణుకులోని ప్రజలకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. 08819 224056, 94910 4147 నంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంగళవారం తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు తీవ్రస్థాయిలో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
VSP: భీమిలి పరిధిలో ఉన్న వాణిజ్య సముదాయాలను నవంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం పాట వేయనున్నట్లు జడ్పీ సీఈవో ఇప్పి నాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తు చెల్లించి ఈ వేళంలో పాల్గొనవచ్చునని తెలిపారు. అదనపు సమాచారం కొరకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కోనసీమ: తుపాను నేపథ్యంలో మంగళవారం రావులపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన 23 బస్సులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. కాకినాడ 6, సామర్లకోట 2, ఏలూరు 5, బొబ్బర్లంక రూట్లో 5, ముక్తేశ్వరం, మురముళ్ల, ముమ్మిడివరం 3, నార్కేడిమిల్లి 1, కట్టుంగ 1 చొప్పున మొత్తం 23 బస్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.