ATP: జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ దేశాయి రెడ్డప్ప రెడ్డి మృతి పట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం తెలిపారు. పరాకువాండ్లపల్లెలో ఆయన పార్థివదేహానికి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డితో కలిసి నివాళులర్పించారు. రెడ్డప్ప రైతాంగం కోసం పోరాడిన నాయకుడని, నైతిక విలువలతో రాజకీయాలు సాగించారని వెంకటరామిరెడ్డి తెలిపారు.
ప్రకాశం: మొంథా తుపాన్ నేపధ్యంలో పీసీ పల్లి మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో ఉన్న 20 కుటుంబాల వారిని మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో సోమవారం దగ్గర్లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌కి తరలించారు. వారందరికీ తగిన ఏర్పాటు చేయాలని రెవిన్యూ సిబ్బందికి సూచించారు. కాగా, తుఫాన్ కారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కృష్ణా: వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో గుడివాడలోని లోతట్టు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ సోమవారం సందర్శించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో తక్షణ సహాయం కోసం గుడివాడ పురపాలక సంఘ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712624774ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
SKLM: మొంథా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధర బాబుతో కలిసి సోమవారం క్షేత్రపర్యటన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డెలివరీ తేదీలు దగ్గర పడ్డ గర్భిణీలను ఆసుపత్రులకు తరలించాలన్నారు.
SKLM: ‘మొంథా’ తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని APEPDCL జిల్లా సూపరిండెండెంట్ సోమవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబరు 28 నుంచి 31వరకు జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు. తడిగా ఉన్న విద్యుత్ స్తంబాలను తాకవద్దని హెచ్చరించారు.
NTR: ముంచుకొస్తున్న ముంథా తుఫాను నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కైకలూరు-కలిదిండి మండలంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ప్రజలకు తుపాను భద్రతా సూచనలు తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా కలిదిండి–కైకలూరు రహదారిలోని లాల్వా వంతెన దెబ్బతినడంతో, ఎస్పీ ఆ స్థలాన్ని పరిశీలించి, ప్రజలకు, పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలిస్తామని తెలిపారు.
VSP: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను విశాఖపట్నం పోర్టు అథారిటీలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకూ జరిగే వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పోర్ట్ పరిపాలనా భవనంలోని సాంబమూర్తి ఆటోరియంలో నిర్వహించారు. విశాఖ పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ పోర్ట్ విభాగాధిపతులతో విజిలెన్స్ ప్రమాణం చేయించారు.
KKD: తుఫాన్ నేపథ్యంలో కాకినాడ కలెక్టర్ షన్మోహన్, జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, ఎస్పీ బిందు మాధవ్ సోమవారం సాయంత్రం ఉప్పాడ తీరాన్ని పరిశీలించారు. సూర్యారావుపేట, సుబ్బంపేట, ఉప్పాడ రోడ్డు మీదుగా ప్రయాణించి, అలల ఉధృతిని పరిశీలించారు. తుఫాన్ కాకినాడ తీరానికి దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
NTR: నందిగామ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగాయి. ఈ సమావేశాలలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నాయకులకు దిశనిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామ, బూత్ స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై ద్రుష్టిపెట్టి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.
మన్యం జిల్లాలో నాణ్యమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాకు సహకరించాలని DRO కె. హేమలత తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నెలా DEO/ERO స్థాయిలో అన్ని పార్టీ సమావేశాలను నిర్వహించాలని, ప్రాధాన్యంగా మొదటి వారంలో నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించినట్లు తెలిపారు.
E.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. నిడదవోలు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VSP: రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యలో రూ.40 లక్షల విలువైన వైద్య పరికరాలను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదగా కేజీహెచ్‌కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా 2 వెంటిలేటర్లు, 10 సిరంజి పంపులు, 40 వీల్ చైర్లు, 100 కాట్స్, 5 రెస్పెటరీ హ్యూమిడిఫైర్లు అందజేశారు. ఎమ్మెల్యే రోటరీ సేవా కార్యక్రమాలను అభినందించి విద్యా, వైద్య రంగాలపై దృష్టి సారించాలన్నారు.
అన్నమయ్య: వెలుగల్లు ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తినట్లు గాలివీడు మండలం ఇరిగేషన్ ఏఈ సాంబశివుడు, SI రవీంద్ర తెలిపారు. వారు మాట్లాడుతూ.. గాలివీడు మండలంలో ఉన్న వెలిగల్లు ప్రాజెక్టుకు ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిస్థాయిలో నిండిందన్నారు. మొంథా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వెలుగల్లు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామన్నారు.
ASR: తుఫాన్ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ఉపాధి సిబ్బంది సెలవులు రద్దు చేశామని డ్వామా APD. విశ్వనాథ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం మండల గ్రామాల్లో ఉపాధి సిబ్బంది శ్రామికులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.