AKP: ఎలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులో పాన్ షాప్ పై సోమవారం దాడి చేసినట్లు ఎస్సై సావిత్రి తెలిపారు. ఈ దాడిలో 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎన్. సూరిబాబు అనధికారికంగా పాన్ షాప్‌లో మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని కంబాల బావి సెంటర్ వద్ద ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేశారు. పండుగ పూట పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కానుకలు పంపిణీ చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దరువూరి నాగేశ్వరరావు, భట్రాజు కార్పొరేషన్ ఛైర్మన్ రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
SKLM: నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుని జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నూతన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు సమాజానికి మార్గదర్శకులని మంత్రి అన్నారు.
KKD: పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈనెల 13న నిధులు జమ కానున్నాయని జగ్గంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు గరిమెళ్ల శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చే రూ. 6,000ల్లో ఆఖరి విడత రూ. 2,000లను మార్చి 13న ప్రధాన మంత్రి విడుదల చేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ సొమ్మును వ్యవసాయ పనుల కోసం వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కడప: జిల్లాలో శెనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న ఫిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శెనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
AKP: టీడీపీ ఉత్తరాంధ్ర క్లస్టర్ ట్రైనింగ్ క్యాంపు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రారంభం అయింది. అనకాపల్లికి చెందిన రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో పలువురు పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్‌లు ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతుంది.
అన్నమయ్య: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కారం లభించింది. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 33 వెబ్ ల్యాండ్ 1B పత్రాలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కోర్ట్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 9 మంది రైతులకు కలెక్టర్ స్వయంగా 1B పత్రాలు అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
W.G: భీమవరం ప్రకాశం సర్కిల్‌లో సోమవారం ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం 100 రోజుల పని కల్పించిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 52 రోజులు కూడా చూపడం లేదని నేతలు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందని YS షర్మిల మండిపడ్డారు.
WG: జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు నిధుల సేకరణ చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం రక్తదాన మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. మానవతా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని జేసీ తెలిపారు.
E.G: నల్లజర్ల(మం) పుల్లలపాడు బస్ స్టాండ్‌లో సోమవారం దొంగతనం జరిగింది. ఏలూరు వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న వృద్ధురాలు చాగండి సుబ్బలక్ష్మి మెడలో నుంచి 5 కాసుల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
SKLM: సోంపేట 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ మరమ్మత్తు పనులు కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పలాస ఈఈ యజ్ఞేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జింకిభద్ర, బెంకిలి పంచాయతీల పరిధిలోని గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.
KDP: YVU విశ్వవిద్యాలయం 21వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. యువత మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేవలం గ్రూప్స్, సివిల్స్ వంటి వాటిపైనే దృష్టి సారించి సమయాన్ని వృధా చేసుకోకుండా, సంపద సృష్టిలో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్ఛారు.
KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఆదోని ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జి సాయి సుబాష్ విచారణ జరిపారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధించగా, ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఎం. రమేష్‌కు 15 రోజుల జైలు శిక్ష పడిందని, పెద్దకడబూరు ఎస్సై మారుతి తెలిపారు.
నెల్లూరులోని జగనన్న కాలనీ సమీపంలో పెన్నా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నవాబుపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తెలుపు గోధుమ రంగు ఫుల్ హాండ్స్ గళ్ళ చొక్కా ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9440796306 సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
TPT: బాలికపై లైంగిక దాడి చేసిన నవీన్ (20)కు హనుమకొండ మొదటి అదనపు జిల్లా సహా పోక్సో కోర్టు న్యాయమూర్తి బి. అపర్ణాదేవి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.14 వేల జరిమానా విధించారు. చిల్లకూరు మండలంనికి చెందిన నవీన్ బాధితురాలిని వేధిస్తూ లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. బాలికకు ప్రభుత్వం నుంచి రూ.14 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.